పాలిటెక్నిక్ లను ఉన్నత విద్యాశాఖ పరిధిలోనే కొనసాగిస్తూ ఉత్తర్వులు..
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన నాయకులు
ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 18: పాలిటెక్నిక్ ఉద్యోగులు, విద్యార్థుల 35 రోజులుగా చేసిన ఆందోళనలకు ఫలితం దక్కింది.. పాలిటెక్నిక్ కళాశాలల భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.157 సాంకేతిక విద్యారంగంలో హర్షాతిరేకాలు నింపింది. పాలిటెక్నిక్ కళాశాలలను కార్మిక శాఖ పరిధిలోకి తీసుకువెళ్తూ గతంలో జారీ చేసిన జీవో నం.97ను రద్దు చేయాలన్న డిమాండ్‌కు సానుకూల స్పందన లభించడంతో సిద్దిపేట టిపిజాక్ నాయకులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.ఈ సందర్భంగా బుధవారం టిపిజాక్ రాష్ట్ర సహాధ్యక్షుడు, రాజగోపాలపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రధానాచార్యుడు బూరం అభినవ్ మాట్లాడుతూ.. సాంకేతిక విద్యాశాఖ ఉద్యోగులు, పాలిటెక్నిక్ విద్యార్థులు ఐక్యంగా 35 రోజులపాటు వివిధ రూపాల్లో నిరసనలు, ధర్నాలు చేపట్టడం వల్లే ప్రభుత్వం స్పందించి జీవో నం.157ను విడుదల చేసిందని తెలిపారు.
ఉద్యోగులు, విద్యార్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ కమిటీ సభ్యులు విద్యార్థులు, ఉద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకొని సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారని పేర్కొన్నారు. ఆ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.జీవో నం.157 ప్రకారం పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నత విద్యాశాఖ పరిధిలోనే కొనసాగుతాయని స్పష్టత వచ్చిందని తెలిపారు. అయితే రాష్ట్ర సాంకేతిక విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ కొనసాగింపు విషయంలో ప్రభుత్వం మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.ఉద్యోగులు, విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి, ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఉన్నతస్థాయి కమిటీ సభ్యులకు టిపిజాక్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిజాక్ రాష్ట్ర నాయకులు బూరం అభినవ్, పాతూరి శ్రీనివాసరెడ్డి, వై. రాజు, స్థానిక కళాశాల టిపిజాక్ నాయకులు రామకృష్ణ, కవిత, కమాల్ అహ్మద్, మధుబాబు, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.





























