ముందస్తు గుర్తింపుతో క్యాన్సర్‌కు మెరుగైన చికిత్స
యశోద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మాచా కిరణ్ కుమార్
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ నవంబర్ 17: మహిళలు క్యాన్సర్‌పై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ముందస్తు గుర్తింపు కోసం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని యశోద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమటో-ఆంకాలజిస్ట్ డాక్టర్ మాచా కిరణ్ కుమార్ సూచించారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.మెదక్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవాలంటే పొగాకు వినియోగానికి పూర్తిగా దూరంగా ఉండాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. వ్యాధి లక్షణాలు కనిపించే వరకు వేచి చూడకుండా వైద్యుల సలహా మేరకు ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు.మహిళలు రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు మ్యామోగ్రామ్ పరీక్షలు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను గుర్తించేందుకు పాప్ స్మియర్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వయస్సు, ఆరోగ్య పరిస్థితి, వైద్యుల సలహా మేరకు అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించవచ్చన్నారు.క్యాన్సర్‌పై భయపడకుండా అవగాహన పెంచుకోవాలని, ముందస్తు పరీక్షలు, సకాలంలో చికిత్సతో వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని డాక్టర్ మాచా కిరణ్ కుమార్ తెలిపారు.



























