ప్రతిపక్షం, ఆగస్టు 14: తెలంగాణ ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వీటి పంపిణీ ప్రారంభం కానుంది. నకిలీ కార్డులను అరికట్టడంతో పాటు కార్డు అసలుదనాన్ని సులభంగా గుర్తించేలా ప్రభుత్వం ఆధునిక భద్రతా ప్రమాణాలతో వీటిని రూపొందించింది. మొత్తం 9 రకాల భద్రతా అంశాలను కార్డులో పొందుపరిచినట్లు అధికారులు వెల్లడించారు.
స్మార్ట్ రేషన్ కార్డు ముందు భాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రాలతో పాటు లబ్ధిదారుడి వివరాలు, రేషన్ దుకాణం నంబర్, అధికారిక సంతకం వంటి వివరాలు ఉంటాయి. కార్డు ముందు, వెనుక భాగాల్లో కనిపించే, కనిపించని, స్పర్శ ద్వారా గుర్తించగలిగే, డిజిటల్‌గా ధ్రువీకరించగలిగే భద్రతా అంశాలను ఏర్పాటు చేశారు.
కార్డులో సెక్యూర్ హోలోగ్రామ్, మైక్రో టెక్స్ట్, డ్యూయల్ హిడెన్ ఇమేజెస్, యూవీ లోగో, గిల్లోష్ ప్యాటర్న్ వంటి ప్రత్యేక భద్రతా లక్షణాలు ఉన్నాయి. నిర్దిష్ట కోణంలో చూసినప్పుడు లేదా భూతద్దంతో పరిశీలించినప్పుడు మాత్రమే కనిపించే కొన్ని రహస్య గుర్తులను కూడా పొందుపరిచారు. యూవీ కాంతిలో మాత్రమే కనిపించే ప్రత్యేక లోగో ద్వారా కార్డు అసలుదనాన్ని నిర్ధారించవచ్చు.
అలాగే కార్డు వెనుక భాగంలో ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. అనుమతించబడిన వ్యవస్థ ద్వారా దాన్ని స్కాన్ చేసి లబ్ధిదారుడి వివరాలను ధ్రువీకరించేందుకు వీలు కల్పించారు. కార్డుపై కొన్ని అక్షరాలను ఎంబోస్ చేయడంతో వాటిని చేతితో తాకడం ద్వారా కూడా గుర్తించే అవకాశం ఉంటుంది.
ఈ భద్రతా ఏర్పాట్లతో నకిలీ రేషన్ కార్డుల తయారీకి అడ్డుకట్ట వేయడంతో పాటు, లబ్ధిదారుల వివరాలను డిజిటల్‌గా ధ్రువీకరించడం సులభం కానుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది.





























