ప్రతిపక్షం, ఆగస్టు 10: కెనడాలో ఓ చిన్నారి చేసిన మారాం కారణంగా ఏకంగా విమాన సర్వీసును రద్దు చేయాల్సి వచ్చింది. విమానంలో సీటు బెల్ట్ పెట్టుకోకుండా సీటుపై నిలబడిన బాలికను ఎంతగా బుజ్జగించినా వినకపోవడంతో విమాన సిబ్బంది చివరకు కఠిన నిర్ణయం తీసుకున్నారు.
వివరాల ప్రకారం.. విక్టోరియా విమానాశ్రయం నుంచి టొరంటోకు వెళ్లేందుకు ఓ విమానం సిద్ధమైంది. ప్రయాణికులంతా తమ సీట్లలో కూర్చున్న సమయంలో ఓ బాలిక మాత్రం సీటు బెల్ట్ పెట్టుకోకుండా సీటుపై నిలబడింది. ఆమెను కూర్చోబెట్టి బెల్ట్ పెట్టేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించినప్పటికీ చిన్నారి ఏడుస్తూ మారాం చేసింది.
విమాన సిబ్బంది కూడా పలుమార్లు సూచించినా బాలిక సీటు బెల్ట్ పెట్టుకోవడానికి నిరాకరించింది. విమాన ప్రయాణంలో భద్రతా నిబంధనల ప్రకారం సీటు బెల్ట్ తప్పనిసరి కావడంతో సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ చిన్నారి వినకపోవడంతో విమానాన్ని తిరిగి టెర్మినల్ వద్దకు తీసుకెళ్లారు.
అనంతరం బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులను విమానం నుంచి కిందకు దించారు. ఈ మొత్తం ప్రక్రియలో విమానం బయలుదేరాల్సిన సమయం దాటిపోయింది. దీంతో సర్వీసును కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో చివరకు విమానాన్ని రద్దు చేసినట్లు సమాచారం.
ఒక చిన్నారి సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం కారణంగా వందలాది మంది ప్రయాణికుల ప్రయాణం ఆలస్యమై, చివరకు విమాన సర్వీసే రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన విమాన ప్రయాణాల్లో భద్రతా నిబంధనలను ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది.





























