ప్రతిపక్షం, నవంబర్ 17: సమ్మక్క సాగర్ బ్యారేజీకి అవసరమైన అనుమతుల సాధన దిశగా తెలంగాణ ప్రభుత్వానికి కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) జారీ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తిపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి సానుకూలంగా స్పందించారు. ఎన్ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. మంగళవారం ఛత్తీస్గఢ్లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సమ్మక్క సాగర్ బ్యారేజీకి సంబంధించిన అనుమతులు, నీటి నిల్వ, ముంపు ప్రాంతాలు, భూసేకరణ, పరిహారం వంటి అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారు.
తెలంగాణలో ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి వివరించారు. సమ్మక్క సాగర్లో గోదావరి జలాలను నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రావాలంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు రావడం కీలకమని తెలిపారు. బ్యారేజీకి సంబంధించిన మిగిలిన అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రాజెక్టు కారణంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ముంపునకు గురయ్యే భూములకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఐఐటీ ఖరగ్పూర్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఛత్తీస్గఢ్లో సుమారు 33 ఎకరాల మేర మాత్రమే ముంపు ఉంటుందని సీఎం పేర్కొన్నారు. భారీ వరదలు వచ్చిన సందర్భంలో కూడా ముంపు ప్రాంతం 100 ఎకరాలకు మించదని వివరించినట్లు సమాచారం. ఈ అంశాల ఆధారంగా ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కోరారు.
ఇప్పటికే తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ బ్యారేజీ పూర్తిస్థాయి నీటిమట్టం 83 మీటర్ల వద్ద 6.94 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉందని వివరించారు. గోదావరి జలాలను సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించుకోవడమే ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. బ్యారేజీ నిర్మాణం పూర్తయినప్పటికీ, అవసరమైన అనుమతులు లభించకపోవడంతో పూర్తిస్థాయి వినియోగంపై ఎదురవుతున్న అడ్డంకులను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ఎన్ఓసీ జారీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వానికి ఊరటనిచ్చే అంశంగా మారింది. అయితే ఎన్ఓసీ అధికారికంగా ఎప్పుడు జారీ అవుతుంది, మిగిలిన అనుమతుల ప్రక్రియ ఎప్పటిలోగా పూర్తవుతుంది అన్నది స్పష్టత రావాల్సి ఉంది. అనుమతులు లభిస్తే సమ్మక్క సాగర్ బ్యారేజీని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు మార్గం సుగమం కానుంది. తద్వారా గోదావరి జలాలను సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగించుకునే లక్ష్యానికి మరింత ముందడుగు పడనుంది.




























