జూన్ 2 నాటికి టిమ్స్‌, వరంగల్‌ ఆసుపత్రుల పనులు పూర్తి.. సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

ప్రతిపక్షం, నవంబర్ 13: తెలంగాణలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేయడంతోపాటు పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నిర్మాణంలో ఉన్న ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్‌ 2 నాటికి అల్వాల్‌, ఎల్‌బీ నగర్‌ టిమ్స్‌ ఆసుపత్రులతోపాటు వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్‌ విస్తరణ పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తిచేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆసుపత్రుల భవనాల నిర్మాణంతోపాటు వైద్య పరికరాల కొనుగోలు, వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలను కూడా ఒకేసారి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టిమ్స్‌ ఆసుపత్రులు, వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్‌ విస్తరణ, నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాల పురోగతిని సమీక్షించారు. నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రులు ప్రారంభమయ్యే సమయానికే అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు, వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. భవనాలు నిర్మించిన తర్వాత సిబ్బంది, పరికరాల కోసం ఎదురుచూసే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను 30 వేల నుంచి 38 వేలకు పెంచినట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఆరోగ్య రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఒక్కో కుటుంబానికి అందించే వైద్య చికిత్సల బీమా పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను మరింత విస్తరించడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.

మూడు టిమ్స్‌ ఆసుపత్రులైన సనత్‌నగర్‌, అల్వాల్‌, ఎల్‌బీ నగర్‌లలో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలను ఏకీకృత విధానంలో చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య సేవల అవసరాలకు అనుగుణంగా ఈ మూడు ఆసుపత్రుల మధ్య వైద్యులు, సిబ్బందిని బదిలీ చేసుకునే వెసులుబాటు ఉండాలని సూచించారు. దీనివల్ల ఏ ఆసుపత్రిలోనైనా వైద్యుల కొరత ఏర్పడితే మరో ఆసుపత్రి నుంచి సిబ్బందిని సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. శాశ్వత నియామకాలు పూర్తయ్యే వరకు అవసరమైన వైద్యులను బయటి నుంచి నియమించుకోవాలని, ఇందుకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతలను వైద్యులపై పూర్తిగా మోపకుండా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్‌రెడ్డి సూచించారు. హౌస్‌కీపింగ్‌, నిర్వహణ సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌ విధానంలో నియమించాలని ఆదేశించారు. టిమ్స్‌ ఆసుపత్రుల పర్యవేక్షణ కోసం గ్రూప్‌-1 అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. ఆసుపత్రుల నిర్వహణ, పారిశుద్ధ్య సిబ్బంది పనితీరును పర్యవేక్షించేందుకు విశ్రాంత సైనికాధికారుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. పరిపాలన, నిర్వహణ బాధ్యతలకు ప్రత్యేక సిబ్బంది ఉంటే వైద్యులు రోగులకు చికిత్స అందించడంపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించగలరని అభిప్రాయపడ్డారు.

నిమ్స్‌ ఆసుపత్రిలో శస్త్రచికిత్సల కోసం రోగులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తున్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. నిమ్స్‌లో పడకలు అందుబాటులో లేకపోయినా, శస్త్రచికిత్సలకు ఆలస్యం జరిగినా సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. సనత్‌నగర్‌ టిమ్స్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి నిమ్స్‌పై ఉన్న రోగుల ఒత్తిడిని తగ్గించాలని ఆదేశించారు. ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీతోపాటు నిమ్స్‌, టిమ్స్‌ డైరెక్టర్లు నిరంతరం సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో డయాలసిస్‌ సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 16 డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న మరో 79 డయాలసిస్‌ కేంద్రాల పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అదేవిధంగా టిమ్స్‌ ఆసుపత్రులతోపాటు వైద్య కళాశాలలు, నర్సింగ్‌ కళాశాలల నిర్మాణ పనులు, అవసరమైన పరికరాల కొనుగోలు ప్రక్రియను సమాంతరంగా పూర్తి చేయాలని తెలిపారు. ఇందుకోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది హాజరును పర్యవేక్షించేందుకు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని ఏఐ ఆధారిత పర్యవేక్షణతో అమలు చేయాలని సూచించారు. దీనివల్ల వైద్యులు, సిబ్బంది సమయపాలనను పర్యవేక్షించడంతోపాటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిరంతరాయంగా అందేలా చూడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుండటంపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఏటా సుమారు 7 కోట్లుగా ఉన్న ఔట్‌పేషెంట్ల (ఓపీ) సంఖ్య ప్రస్తుతం 9 కోట్లకు చేరినట్లు తెలిపారు. ఇన్‌పేషెంట్ల (ఐపీ) సంఖ్య కూడా 23 లక్షల నుంచి 24.30 లక్షలకు పెరిగిందని వెల్లడించారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతున్నందున ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆరోగ్య రంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో గతంలో సగటున 3.9 శాతం నిధులు కేటాయించగా, గత మూడేళ్లుగా సగటున 4.8 శాతం కేటాయిస్తున్నట్లు వివరించారు.

వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీపై కూడా ముఖ్యమంత్రి కీలక వివరాలు వెల్లడించారు. గత మూడేళ్లలో వైద్యులు, నర్సులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్‌ సిబ్బంది కలిపి మొత్తం 13,401 నియామకాలు పూర్తి చేసినట్లు తెలిపారు. మరో 5,640 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వైద్యారోగ్య శాఖకు అవసరమైన నిధులను ఎంత మొత్తమైనా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువుల్లో ఆసుపత్రుల నిర్మాణాలు, సిబ్బంది నియామకాలు, పరికరాల సమకూర్పు పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వ వైద్య వ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది.

Related News

Latest News