గ్యాస్ ఏజెన్సీ లేక.. చండూరు ప్రజల గోస!

*డివిజన్ కేంద్రంలో 19 గ్రామాల లబ్ధిదారుల నరకయాతన
*అదనపు వసూళ్లతో దగా చేస్తున్న పక్క మండలాల ఏజెన్సీ నిర్వాహకులు.
*గ్యాస్ సిలిండర్ కోసం రోజు మొత్తం పని బంద్ – రోడ్డుపై పడిగాపులు.
*ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం: మున్సిపల్ కమిషనర్ మల్లేశం

ప్రతిపక్షం చండూరు, అక్టోబర్ 04 : రెవెన్యూ డివిజన్ కేంద్రమైన చండూరు పట్టణంలో గ్యాస్ ఏజెన్సీ లేకపోవడంతో 19 గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. సిలిండర్ కోసం రోజంతా పనులు మానుకొని రోడ్డుపై పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది.
*19 గ్రామాలకు ఒకటే బాధ:
డివిజన్ స్థాయికి ఎదిగినా ఇప్పటివరకు ఏజెన్సీ ఏర్పాటు కాకపోవడంతో చండూరు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు నల్లగొండ, చిట్యాల, మర్రిగూడ, నాంపల్లి ఏజెన్సీలపై ఆధారపడాల్సి వస్తోంది. శనివారం ఒక్కరోజే చండూరు పట్టణంలో దాదాపు 200 మంది వినియోగదారులు బుక్ చేసుకున్నా, సరైన సమయానికి డెలివరీ కావడం లేదని వాపోతున్నారు.
*అదనపు వసూళ్లతో దోపిడీ:
ఇదే అదునుగా పక్క మండలాల గ్యాస్ నిర్వాహకులు రవాణా ఖర్చుల పేరుతో ఒక్కో సిలిండర్ పై రూ.60 నుండి రూ.120 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రశ్నించేవారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని మండిపడుతున్నారు.
*ఏజెన్సీ కోసం కృషి చేస్తాం – కమిషనర్:
ఈ సమస్యపై మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం స్పందిస్తూ.. ప్రజల ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయని, వెంటనే ఈ విషయాన్ని ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చండూరులో కొత్త గ్యాస్ ఏజెన్సీ మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Spread the love

Related News

Latest News