[t4b-ticker]

ఏటీఎంలలో వరుస చోరీలు.. పోలీసుల వైఫల్యమే కారణమా?

  • ఒకే రాత్రి రెండు చోట్ల ఏటీఎంలలో చోరీ
  • గుర్తుతెలియని కారులో వచ్చిన ముగ్గురు దుండగులు
  • ఏటీఎంలను ధ్వంసం చేసి నగదు అపహరణ
  • సీసీ కెమెరాల్లో నమోదైన చోరీ దృశ్యాలు
  • రంగంలోకి దిగిన క్లూస్ టీం.. ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు పరిశీలన

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ ఆగస్టు 19: మెదక్ జిల్లాలో ఏటీఎంలలో వరుస చోరీలు కలకలం రేపాయి. ఒకే రాత్రి రెండు ప్రాంతాల్లో ఎస్బీఐ ఏటీఎంలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి నగదు అపహరించుకెళ్లారు. చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి, మెదక్ మండలం మంబోజిపల్లి గ్రామాల్లో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి.

గవ్వలపల్లిలోని ఎస్బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. అదే విధంగా మంబోజిపల్లిలోని ఎస్బీఐ ఏటీఎంలోనూ చోరీ జరిగింది. గుర్తుతెలియని కారులో వచ్చిన ముగ్గురు దుండగులు ఏటీఎంను పగలగొట్టి నగదు అపహరించినట్లు తెలుస్తోంది. చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలాలకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలిసింది.

ఏటీఎంల నుంచి ఎంత మొత్తంలో నగదు అపహరణకు గురైందనే విషయం బ్యాంకు అధికారులు లెక్కలు పరిశీలించిన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

వరుస ఘటనలతో ఆందోళన

జిల్లాలో ఒకే రాత్రి రెండు ఏటీఎంలలో చోరీలు జరగడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటీఎంల వద్ద భద్రతా చర్యలు, రాత్రివేళ పోలీసుల గస్తీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరుస చోరీలకు పోలీసుల వైఫల్యమే కారణమంటూ కొందరు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే చోరీలకు దారితీసిన కారణాలు, భద్రతా లోపాలపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News