[t4b-ticker]

చేనేత కేవలం వృత్తి కాదు.. మన సంస్కృతికి ప్రతీక: మంత్రి సీతక్క

ప్రతిపక్షం, ఆగస్టు 07: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సేవలను ఆమె కొనియాడుతూ, నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ, వ్యవసాయం తర్వాత అత్యంత కష్టపడే వర్గం చేనేత కార్మికులేనని పేర్కొన్నారు. రైతులతో పాటు నేతన్నలు కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన బలమని అన్నారు. వ్యవసాయం, చేనేత రంగాలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లతో సమానమని వ్యాఖ్యానించారు.

చేనేత అనేది కేవలం జీవనోపాధి కల్పించే వృత్తి మాత్రమే కాదని, అది తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వానికి ప్రతీక అని మంత్రి తెలిపారు. చేనేత రంగాన్ని పరిరక్షించడం, ఆధునికీకరించడం, నేతన్నల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు.

చేనేత ఉత్పత్తులను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసి నేతన్నలను ప్రోత్సహించాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, చేనేత కార్మికులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News