ప్రతిపక్షం, ఆగస్టు 19, నల్గొండ: తెలంగాణలో సంచలనం సృష్టించిన కొండమల్లేపల్లి ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ దారుణ హత్యకు అదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులే పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు మందలించిన ప్రిన్సిపల్‌పై వారు పెంచుకున్న కక్ష చివరకు హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది.
పోలీసుల వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రూపారెడ్డి ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. పాఠశాలకు సెల్‌ఫోన్ తీసుకురావడంపై గతంలో కొందరు పదో తరగతి విద్యార్థులను ఆమె మందలించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ప్రిన్సిపల్‌పై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం పెంచుకున్నారని దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
ఈ క్రమంలోనే రూపారెడ్డిపై కక్ష పెంచుకున్న విద్యార్థులు ఆమెను హత్య చేసేందుకు పథకం వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆగస్టు 11న మరో వ్యక్తి సహాయంతో ఆమెపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అత్యంత దారుణంగా కత్తితో 27 సార్లు పొడిచి రూపారెడ్డిని హత్య చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
హత్య అనంతరం నగదు తీసుకుని పరారీ
హత్య చేసిన అనంతరం నిందితులు ఇంట్లో ఉన్న సుమారు రూ.4 లక్షల నగదును తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. దీంతో తొలుత ఈ ఘటనను దోపిడీ కోణంలోనూ దర్యాప్తు చేసిన పోలీసులు, అనంతరం అందుబాటులో ఉన్న ఆధారాలు, అనుమానితుల కదలికలు, ఇతర వివరాలను పరిశీలించి అసలు నిందితులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
పాఠశాలలో చదువుతున్న విద్యార్థులే ఈ హత్యకు పాల్పడినట్లు వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం పాఠశాలకు సెల్‌ఫోన్ తీసుకురావడంపై మందలించారన్న కోపంతోనే ఇంతటి దారుణానికి పాల్పడ్డారన్న విషయం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
కేసులో మరో వ్యక్తి పాత్రపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ముందు నిందితులు వేసుకున్న ప్రణాళిక, ఘటన అనంతరం వారి కదలికలు, నగదు తీసుకుని పరారైన విధానంపై పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను దర్యాప్తు పూర్తయిన తర్వాత పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.





























