ప్రతిపక్షం, ఆగస్టు 04: ఇజ్రాయెల్–భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు తమ దేశం భారీగా పెట్టుబడులు పెడుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. భారత్‌తో వ్యూహాత్మక, ఆర్థిక, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ తమ అత్యంత సన్నిహిత మిత్రుల్లో ఒకరని నెతన్యాహు వ్యాఖ్యానించారు. “ఇజ్రాయెల్ ప్రపంచంలో ఏకాకిగా మారిందని కొందరు చెబుతున్నారు. కానీ భారతదేశంలో ఇజ్రాయెల్‌కు, వ్యక్తిగతంగా నాకు లభిస్తున్న మద్దతు నిజంగా విశేషమైనది” అని అన్నారు.
అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా మరిన్ని దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, కొత్త అలయన్స్‌లు ఏర్పాటు చేసుకోవడం తమ లక్ష్యమని నెతన్యాహు వెల్లడించారు. భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు ఇరు దేశాలకు మరింత ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

















