ప్రతిపక్షం, ఆగస్టు 04: తెలంగాణలో ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన డిజిటల్ సేవలు అందించేందుకు ప్రభుత్వం మీ సేవ కేంద్రాల ఆధునీకరణపై దృష్టి సారించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో మీ సేవ కేంద్రాలను సాంకేతికంగా మరింత బలోపేతం చేయడంతో పాటు డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రపంచ బ్యాంక్ డిజిటల్–ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్‌చందానీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందంతో సీఎస్ సంజయ్ జాజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘డిజిటల్ ఇండియా – వికసిత్ భారత్–2047’ లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణలో డిజిటల్ పాలనను మరింత విస్తరించే అంశాలపై విస్తృతంగా చర్చించారు.
రాష్ట్రంలోని నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి మీ సేవ కేంద్రాన్ని ఆధునికీకరించి, సాంకేతిక సమస్యలు లేకుండా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని సీఎస్ సూచించారు. అలాగే భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యాధునిక డేటా సెంటర్ల ఏర్పాటు, కృత్రిమ మేధస్సు (AI), సైబర్ భద్రత, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి, ఐటీ ఆధారిత ఉపాధి అవకాశాల విస్తరణపై కూడా సమావేశంలో చర్చ జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ గవర్నెన్స్ సంస్కరణలను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అభినందించారు. డేటా గవర్నెన్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం, ప్రజా సేవల నాణ్యత పెంపు వంటి రంగాల్లో సాంకేతిక సహకారం, అంతర్జాతీయ ఉత్తమ విధానాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో డిజిటల్ రంగ అభివృద్ధికి సంబంధించి సుమారు రూ.2,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు.
సమావేశం అనంతరం సీఎస్ సంజయ్ జాజు టి-ఫైబర్ ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ విస్తరణను వేగవంతం చేసి, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి నాణ్యమైన డిజిటల్ సేవలు అందేలా నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంచి, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పనుల పురోగతిని ప్రతి వారం సమీక్షించాలని అధికారులకు సూచించారు.

















