బంగారం కోసం మహిళ హత్య
గతంలో మరో రెండు నేరాలు వెలుగులోకి
నిందితురాలు రజిత అరెస్ట్
ఈ నేరంలో పాల్గొన్న బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలింపు
మరో నలుగురు మహిళలను హత్య చేసేందుకు టార్గెట్‌గా పెట్టుకున్న నిందితులు
సీసీ కెమెరాల ఆధారంగా వారం రోజుల్లో కేసు ఛేదన
రష్మీ పెరుమాళ్, పోలీస్ కమిషనర్, సిద్ధిపేట
ప్రతిపక్షం ప్రతినిధి,సిద్ధిపేట, ఆగస్టు 16: సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట శివారులో పాక్షికంగా కాలిపోయిన మహిళ మృతదేహం లభ్యమైన కేసును సిద్ధిపేట పోలీసులు వారం రోజుల్లో ఛేదించారు. బంగారు ఆభరణాల కోసం సిద్ధిపేట జిల్లా అక్బరు పేట భూంపల్లి మండలం భూం పల్లికి చెందిన అతికం విజయ(45)ను అదే గ్రామానికి చెందిన చాకలి రజిత (38), ఓ బాలుడు కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గతంలో జరిగిన మరో రెండు నేరాలు కూడా వెలుగులోకి రావడం కలకలం రేపింది. నిందితురాలు రజితను అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. బాలుడిని జువైనల్ హోమ్‌కు పంపినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు.
కాలిపోయిన
మృతదేహంతో వెలుగులోకి వచ్చిన హత్య
ఈ నెల 8వ తేదీన రామక్క పేట గ్రామ శివారులో రోడ్డు పక్కన పాక్షికంగా కాలిపోయిన గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో దుబ్బాక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానిక పోలీసులతో పాటు సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, ఇతర ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.మృతదేహం ఎవరిదనే విషయాన్ని తేల్చేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను విస్తృతంగా పరిశీలించారు. ఈ క్రమంలో మృతురాలు భూంపల్లి గ్రామానికి చెందిన అతికం విజయగా పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె కదలికలు, పరిచయాలు, చివరి సారిగా ఎవరిని కలిసిందన్న కోణంలో దర్యాప్తు కొనసాగించారు.
కిరాణా దుకాణంలోకి పిలిచి.. గొంతు పిసికి హత్య
పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రజిత, బాలుడు కలిసి విజయను కిరాణా దుకాణంలోకి పిలిచి గొంతు పిసికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం అదే రాత్రి మృతదేహాన్ని టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనంపై రామక్క పేట శివారుకు తీసుకు వెళ్లారు. అక్కడ పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగులబెట్టినట్లు విచారణలో వెల్లడైంది.మృతదేహాన్ని కాల్చి వేయడం ద్వారా హత్యకు సంబంధించిన ఆధారాలను చెరిపి వేసి, పోలీసుల దృష్టిని తప్పించుకోవాలనే ఉద్దేశంతో నిందితులు వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.
గతంలో మరో రెండు నేరాలు
విజయ హత్య కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో నిందితుల గత నేరాలకు సంబంధించిన వివరాలు కూడా బయట పడ్డాయి. మే 28వ తేదీన డబుల్ బెడ్రూం ఇళ్లలో నివసించే కుంట రేఖను కూడా ఇదే తరహాలో హత్య చేసి, అచ్చుమాయిపల్లి అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని కాల్చి వేసినట్లు పోలీసులు వెల్లడించారు. 2025 జూన్‌లో భూంపల్లికి చెందిన అన్నపూర్ణ వాకింగ్‌కు వెళ్లిన సమయంలో ఆమెపై దాడి చేసి, మెడలోని సుమారు ఐదు తులాల పుస్తెల తాడును దొంగిలించినట్లు దర్యాప్తులో తేలింది.దీంతో బంగారు ఆభరణాల కోసం ఒంటరిగా ఉండే మహిళలను గుర్తించి, వారి కదలికలను గమనించి నేరాలకు పాల్పడుతున్నారనే అనుమానాలకు బలం చేకూరింది.
రూ.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
నిందితుల నుంచి పోలీసులు 5.61 తులాల బంగారు ఆభరణాలు, 53 తులాల వెండి ఆభరణాలు, రూ.1.03 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు, ఏపీ15ఏసీ1165 నంబర్ గల నీలం రంగు టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
మరో నలుగురు మహిళలు టార్గెట్
దర్యాప్తులో మరింత ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీ పాయింట్ల వద్ద ప్రజల కదలికలను గమనించడం, వారి ఆస్తులు, కుటుంబ పరిస్థితులు, వివాదాలను తెలుసుకోవడం ద్వారా ఒంటరిగా ఉండే మహిళలను నిందితులు లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.ఇప్పటికే రెండు హత్యలకు పాల్పడినట్లు నిర్ధారణ కాగా, మరో నలుగురిని హత్య చేసేందుకు టార్గెట్‌గా పెట్టుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ప్రతి నేరం అనంతరం పోలీసుల దృష్టిని మరోవైపు మళ్లించేలా నిందితులు వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.
సీసీ కెమెరాలే కీలక ఆధారం
కేసు ఛేదనలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషించాయని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సీసీటీవీ నిఘా వ్యవస్థ గణనీయంగా పెరిగిందని, ఈ కేసులోనూ సీసీటీవీ ఫుటేజీలు దర్యాప్తుకు ఎంతో ఉపయోగ పడ్డాయని పేర్కొన్నారు. నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని సీపీ సూచించారు. నిర్జన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు వెల్లడించ వద్దని సూచించారు. ఇళ్లు, వ్యాపార సంస్థల వద్ద బ్యాకప్ సదుపాయంతో కూడిన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
పోలీసు బృందాలకు సీపీ అభినందనలు
కేసును సత్వరమే ఛేదించిన సిద్ధిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, దుబ్బాక సీఐ రాజేశ్, ఎస్‌ఐ కీర్తి రాజు, భూంపల్లి ఎస్‌ఐ రాజశేఖర్, మిరుదొడ్డి ఎస్‌ఐ సతీశ్, ఎస్‌ఐ సైఫ్ అలీ, సిద్ధిపేట డివిజన్ సిబ్బంది, సీసీఎస్ సదన్ కుమార్, ఇన్‌స్పెక్టర్ జాన్ రెడ్డి, సిబ్బంది, టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సిబ్బందిని సీపీ రష్మీ పెరుమాళ్ ప్రత్యేకంగా అభినందించారు.
వారం రోజుల్లోనే మృతదేహం గుర్తింపు
నుంచి నిందితుల అరెస్టు వరకు దర్యాప్తును పూర్తి చేయడం, గత నేరాలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా సిద్ధిపేట పోలీసులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. మరో వైపు, నిందితులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడైన మరో నలుగురి వివరాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






























