ప్రతిపక్షం, జూలై 31, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి, తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను లొంగదీసుకున్నారని, అనంతరం రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల పేరుతో తన వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. అలాగే, తనకు తెలియకుండా వ్యక్తిగత వీడియోలు చిత్రీకరించి వాటితో బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి ఆరోపణలపై ఆధారాలను సేకరిస్తున్నట్లు సమాచారం.
రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఆయన స్పందన రావాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

















