ప్రతిపక్షం, ఆగస్టు 05: దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ వినియోగదారులకు మరో షాక్ ఇచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉన్న రూ.299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను సంస్థ నిలిపివేసింది. దీంతో ఈ ప్లాన్‌ను ఉపయోగిస్తున్న లక్షలాది మంది వినియోగదారులు ఇకపై అధిక ధర కలిగిన ప్లాన్‌ను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రూ.299 ప్లాన్‌ను తొలగించిన తర్వాత 28 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉన్న కనిష్ఠ ప్లాన్‌గా రూ.349 ప్లాన్ మాత్రమే మిగిలింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు రోజుకు 2GB హైస్పీడ్ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు అందించనున్నారు. అలాగే అదనపు డిజిటల్ ప్రయోజనాలు కూడా ప్లాన్‌లో భాగంగా లభించే అవకాశం ఉంది.
ఇదే కాకుండా 56 రోజుల వ్యాలిడిటీతో ఉన్న రూ.579 ప్లాన్, 60 రోజుల వ్యాలిడిటీతో ఉన్న రూ.619 ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను కూడా ఎయిర్‌టెల్ అందుబాటులో నుంచి తొలగించినట్లు సమాచారం. దీంతో మధ్యస్థ బడ్జెట్‌లో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశముంది.
టెలికాం సంస్థలు ఇటీవల సగటు వినియోగదారుడి ఆదాయాన్ని (ARPU) పెంచే వ్యూహంలో భాగంగా తక్కువ ధర ప్లాన్‌లను క్రమంగా ఉపసంహరించుకుంటున్నాయి. అదే దిశగా ఎయిర్‌టెల్ కూడా ఈ మార్పులు చేసినట్లు మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
రూ.299 ప్లాన్ నిలిపివేతతో తక్కువ ఖర్చుతో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు ఇకపై రూ.349 లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన ప్లాన్‌లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ అధికారిక యాప్, వెబ్‌సైట్‌లో కొత్త ప్లాన్‌ల వివరాలు అందుబాటులో ఉండగా, వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలని సంస్థ సూచిస్తోంది.

















