ప్రతిపక్షం, జూలై 22: ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో కుటుంబ వివాదం ఆసక్తికర మలుపు తిరిగింది. ఇద్దరు భార్యల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో భర్త వ్యవహారంపై మొదటి భార్య పోలీసులను ఆశ్రయించగా, పోలీసుల సమక్షంలో పెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు.
మహమ్మద్ నజాకత్ అనే వ్యక్తి రెండో భార్య వద్దే ఎక్కువ సమయం గడుపుతున్నాడని మొదటి భార్య ఫిర్యాదు చేసింది. దీంతో ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి చర్చించిన అనంతరం ఓ అంగీకారానికి వచ్చారు.
రాజీ ప్రకారం, భర్త వారంలో మూడు రోజులు మొదటి భార్య వద్ద, మరో మూడు రోజులు రెండో భార్య వద్ద గడపాలని నిర్ణయించారు. మిగిలిన ఒక రోజు అతని వ్యక్తిగత ఇష్టానుసారం ఉండేందుకు అనుమతి ఇచ్చారు. అదనంగా, మొదటి భార్య కుటుంబ ఖర్చుల కోసం ప్రతి వారం రూ.500 చెల్లించాలని కూడా సూచించారు.
ఈ విచిత్ర రాజీ ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఇరు కుటుంబాలు పరస్పర అవగాహనతో జీవించాలని సూచించినట్లు సమాచారం.


















