[t4b-ticker]

శనిగరం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

  • పల్లెపల్లెకు ప్రజాపాలనతో ప్రభుత్వమే ప్రజల వద్దకు.. అభివృద్ధి పనులకు ప్రాధాన్యత

ప్రతిపక్షం, ఆగస్టు 23, సిద్దిపేట: శనిగరం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి గ్రామస్థాయిలోనే పరిష్కారాలు చూపించాలనే లక్ష్యంతో చేపట్టిన “పల్లెపల్లెకు పొన్నం అన్న–పల్లెపల్లెలో ప్రజాపాలన” కార్యక్రమంలో భాగంగా కోహెడ మండలం శనిగరం గ్రామంలో మంత్రి పర్యటించారు.

ఈ సందర్భంగా రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో ఏ మేరకు అమలవుతున్నాయో పరిశీలించారు. అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయా లేదా అనే అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గ్రామ ప్రజలు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధుల నుంచి మంత్రి నేరుగా సమస్యలు, వినతిపత్రాలు స్వీకరించారు. ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామానికి అత్యవసరమైన మొదటి ఐదు పనులను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధికి అవసరమైన మిగిలిన పనులను కూడా దశలవారీగా చేపడతామని తెలిపారు.

శనిగరంలో సంక్షేమ పథకాల అమలు

ప్రజాపాలన ప్రభుత్వంలో శనిగరం గ్రామానికి 46 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. రెండో దశలో మరిన్ని ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. మహాలక్ష్మి పథకం కింద 366 కుటుంబాలకు రూ.500 గ్యాస్ సబ్సిడీగా రూ.1.21 లక్షలు విడుదల చేసినట్లు చెప్పారు. గృహజ్యోతి పథకం కింద 997 కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు రూ.22.41 లక్షల ప్రయోజనం కల్పించినట్లు వివరించారు.

రైతు భరోసా కింద 719 మంది రైతులకు రూ.1.57 కోట్లు అందించామని, 648 మంది రైతులకు రూ.4.54 కోట్ల రైతు రుణమాఫీ జరిగిందని తెలిపారు. రైతు బీమా కింద 17 మంది రైతుల కుటుంబాలకు రూ.85 లక్షలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. గ్రామంలో 829 పింఛన్లు ఉండగా, ప్రతి నెలా రూ.18.91 లక్షలు పింఛన్ల రూపంలో విడుదలవుతున్నాయని తెలిపారు.

గ్రామంలో 1,627 రేషన్ కార్డులు ఉండగా, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 443 రేషన్ కార్డులు పంపిణీ చేయడంతో పాటు 327 యూనిట్లను అదనంగా చేర్చినట్లు మంత్రి తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కూడా కొనసాగుతోందన్నారు.

గ్రామంలో సుమారు 700 ఓట్లు అనమైల్‌గా ఉన్నాయని అధికారులు గుర్తించగా, వాటికి నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.

గ్రామ మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి

శనిగరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించడం, గంగమ్మ కాలువ, బెజ్జంకి కాలువల సీసీ పనులు పూర్తి చేయడం, గ్రామంలోని అంతర్గత రోడ్ల నిర్మాణం, శంకర్‌నగర్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యల పరిష్కారం వంటి అంశాలను గ్రామ సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

గ్రామంలో మరో 2 వేల మీటర్ల సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.60 లక్షలు మంజూరు చేయాలని, అదనంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. గోపన్నగడ్డ నుంచి పోతారం ఎక్స్‌రోడ్డు వరకు బీటీ రోడ్డు, అంగన్‌వాడీ రెండో కేంద్రానికి కొత్త భవనం, మూడో అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు, శనిగరం ప్రాజెక్టు అతిథి గృహం పునర్నిర్మాణం, గ్రామంలో పశువైద్యశాల, మండల పరిషత్ పాఠశాలకు ప్రహరీ గోడ, వీవో భవనాల నిర్మాణం వంటి పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలను కూడా మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సమస్యలను పరిశీలించి అవసరమైన పనులను ప్రాధాన్యత ప్రకారం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండటం, అధికారులు ప్రజల మధ్యకు రావడం, గ్రామ సమస్యలను గ్రామస్థాయిలోనే పరిష్కరించడం “పల్లెపల్లెలో ప్రజాపాలన” కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు.

ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం

వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఆయిల్‌పామ్ సాగు ద్వారా దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.

ఎకరాకు 57 మొక్కలు అందిస్తామని, మొదటి మూడు సంవత్సరాల పాటు సబ్సిడీ అందిస్తామని తెలిపారు. ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటలు సాగు చేసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు. ఒక్క ఎకరాకు సంవత్సరానికి సుమారు రూ.1.50 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని, దాదాపు 30 సంవత్సరాల పాటు స్థిరమైన ఆదాయం పొందవచ్చని వివరించారు.

కోహెడ మండలంలో ఇప్పటికే 1,320 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరుగుతోందని, ఇప్పటివరకు 900 మెట్రిక్ టన్నుల ఆయిల్‌పామ్ గెలలు సేకరించినట్లు తెలిపారు. నర్మేటలోని ఆయిల్‌పామ్ కర్మాగారానికి పంటను తరలించేందుకు రవాణా ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు.

జలసిరి, ప్లాస్టిక్ నియంత్రణకు ప్రాధాన్యత

జలసిరి పథకం కింద ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని మంత్రి ప్రజలకు సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రభుత్వం తరఫున రూ.6,500 ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు.

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు గ్రామాల్లో స్టీల్ బ్యాంకుల వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. శనిగరం గ్రామంలో 1,600 స్టీల్ బ్యాంక్ కిట్లను అందించినట్లు చెప్పారు. ఒక్కో కిట్‌లో 13 రకాల వస్తువులు ఉన్నాయని తెలిపారు. గ్రామంలో జరిగే ప్రతి శుభకార్యంలో స్టీల్ బ్యాంకులను ఉపయోగించి ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని సూచించారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలోని 173 గ్రామాల్లో 289 సంఘాలకు స్టీల్ బ్యాంకులు, 540 హోటళ్లకు స్టీల్ గ్లాసులు అందించినట్లు మంత్రి వివరించారు.

రైతులు, మహిళలు, యువతకు ప్రాధాన్యత

మహిళా సంఘాలను వడ్డీలేని రుణాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. మహిళా సంఘాలకు అందుతున్న రుణాలు, శిక్షణ, ఇతర అవకాశాలు అర్హులైన ప్రతి మహిళకు చేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

శనిగరం హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రధాన ధాన్యం సేకరణ కేంద్రంగా ఉందని, సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే సామర్థ్యానికి అనుగుణంగా ఐకేపీ ద్వారా అవసరమైన మౌలిక వసతులు కల్పించుకోవాలని సూచించారు.

14 నుంచి 15 సంవత్సరాల వయసు గల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణకు అందుబాటులో ఉన్న టీకాపై వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అవగాహన కల్పించి, అర్హులైన వారికి టీకాలు వేయించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

విద్యతో పాటు క్రీడలకు ప్రోత్సాహం

గ్రామంలోని పిల్లలు క్రీడల్లో రాణించేందుకు క్రీడా సామగ్రిని అందించామని మంత్రి తెలిపారు. క్రీడల్లో జాతీయ స్థాయికి ఎదిగితే విద్య, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, విద్యతో పాటు క్రీడలకూ తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలని కోరారు.

హుస్నాబాద్‌లో కబడ్డీ అకాడమీ తీసుకురావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో బహిరంగ వ్యాయామశాలలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రజలు సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

పిల్లివాగు వంతెనకు రూ.17 కోట్ల ప్రతిపాదనలు

రాజీవ్ రహదారి వైపు వెళ్లే పిల్లివాగుపై వంతెన నిర్మాణానికి రూ.17 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించామని మంత్రి తెలిపారు. త్వరలోనే నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తాను ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నానని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా హుస్నాబాద్ ప్రాంతానికి గౌరవం పెరిగేలా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తానని పొన్నం ప్రభాకర్ అన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ శనిగరం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య, జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News