ప్రతిపక్షం, ఆగస్టు 23: సాహిత్యాన్ని కేవలం చదవడం, రాయడంతో పరిమితం చేయకుండా… నూతన ఆలోచనలకు వేదికగా నిలబెట్టి, కొత్త తరం కవులు, రచయితలను ప్రోత్సహిస్తూ గత పదకొండేళ్లుగా విశిష్టమైన సాహిత్య సేవను అందిస్తున్న సంస్థ ‘జన జాగృతి’. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘కవి సాయంత్రం’ సోషల్ మీడియా సాహిత్య వేదిక నేడు ఎందరో నూతన, వర్ధమాన కవులు, రచయితలకు ఆత్మీయ వేదికగా మారింది. సాహిత్యాభిమానులను ఒకచోట చేర్చి, వివిధ సాహిత్య ప్రక్రియలపై అవగాహన కల్పిస్తూ, రచనా సామర్థ్యాన్ని పెంపొందించేలా ‘కవి సాయంత్రం’ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కవిత్వం, కథ, వ్యాసం, గేయం, నానీ తదితర సాహిత్య ప్రక్రియల్లో పోటీలు నిర్వహిస్తూ ప్రతిభను వెలికితీయడంతో పాటు, విజేతలను ప్రోత్సహించడం, నూతన రచయితలకు తమ రచనలను పరిచయం చేసుకునే అవకాశాన్ని కల్పించడం ఈ వేదిక ప్రత్యేకతగా నిలిచింది.
కవి సాయంత్రం శిక్షణ శిబిరం:
‘కవి సాయంత్రం’ ఒక సోషల్ మీడియా గ్రూపు మాత్రమే కాదు… నూతన రచయితలకు ఒక శిక్షణ శిబిరం. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని కవులే కాకుండా, దేశంలోని మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి వంటి పలు రాష్ట్రాల కవులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరంతా తమ సృజనాత్మకతను మెరుగుపరుచుకోవడానికి, రచనలోని లోపాలను సరిదిద్దుకోవడానికి, మెరుగైన రచనలు చేయడానికి ఈ వేదిక ఎంతోమందికి మార్గదర్శకంగా నిలుస్తోంది. అనుభవజ్ఞులైన కవులు, రచయితల సూచనలు, సలహాలు నూతన రచయితలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
ఇక్కడ ఏర్పడిన అనుబంధం మరో ప్రత్యేకత. భిన్న ప్రాంతాలకు, భిన్న వయసులకు చెందిన కవులు, రచయితలు ఒకరినొకరు గౌరవించుకుంటూ, తమ సాహిత్య ప్రయాణంలో పరస్పరం ప్రోత్సహించుకుంటూ ఒక కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి ఉండటం ‘కవి సాయంత్రం’ ప్రత్యేకత. పోటీ కంటే సాహిత్య స్నేహానికి, వ్యక్తిగత ప్రతిభ కంటే సమష్టి సాహిత్య వికాసానికి ఈ వేదిక ప్రాధాన్యత ఇస్తోంది.పదకొండేళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ‘కవి సాయంత్రం’ వేదికగా పరిచయమైన అనేక మంది నూతన కవులు, రచయితలు తమ రచనా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ సాహిత్య రంగంలో గుర్తింపు పొందుతున్నారు. ఒకప్పుడు తమ రచనలను ఎక్కడ ప్రచురించాలో తెలియని ఎందరో యువ రచయితలకు ఈ వేదిక తమ గొంతును వినిపించుకునే అవకాశాన్ని కల్పించింది.
11ఏళ్ళ నిరాటంక ప్రయాణం:
సాహిత్యం సమాజాన్ని ఆలోచింపజేసే శక్తి. ఆ శక్తిని కొత్త తరానికి చేరువ చేయాలనే లక్ష్యంతో ‘కవి సాయంత్రం’ సాగిస్తున్న ప్రయాణం అభినందనీయం. సామాజిక మాధ్యమాన్ని కేవలం వినోదానికి కాకుండా సాహిత్య వికాసానికి, ప్రతిభా వికాసానికి, సృజనాత్మక ఆలోచనలకు ఉపయోగించవచ్చని నిరూపించిన వేదికగా ‘కవి సాయంత్రం’ నిలిచింది. ఈ సాహిత్య ప్రయాణానికి పదకొండేళ్లు పూర్తయిన సందర్భంగా 11వ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం హైదరాబాద్ సమీపంలోని దేశముఖి గ్రామంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కవులు, రచయితలు, సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సాహిత్య కుటుంబంతో కలిసి వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నారు.
పదకొండేళ్ల ప్రయాణం ఒక మైలురాయి మాత్రమే. రాబోయే రోజుల్లో మరింత మంది నూతన కవులను, రచయితలను సాహిత్య రంగానికి పరిచయం చేయడం, వారిలోని ప్రతిభను వెలికితీయడం, సాహిత్యాన్ని సమాజానికి మరింత చేరువ చేయడం ‘కవి సాయంత్రం’ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.సాహిత్యాన్ని ప్రేమించే హృదయాలను కలుపుతూ… కొత్త కలాలకు అక్షర రూపమిస్తూ…కొత్త తరానికి సాహిత్య బాటలు వేస్తూ…‘కవి సాయంత్రం’ పదకొండేళ్ల ప్రస్థానం కొనసాగుతోంది.
హాజరవుతున్న ప్రముఖులు:
కవి సాయంత్రం 11 ఏళ్ల పండుగకు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ డా. గుమ్మడి వెన్నెల గద్దర్, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ జి.వి. శ్యాం ప్రసాద్ లాల్, ప్రముఖ సినీ క్రిటిక్, గద్దర్ అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్ర, ప్రముఖ సినీ గీత రచయిత మౌనశ్రీ మల్లిక్, ప్రముఖ కవి, రచయిత డా. పొన్నాల బాలయ్య, ఉద్యమ గాయని, ప్రజాగొంతుక అరుణోదయ నిర్మల తదితరులు హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా ముక్కెర సంపత్ కుమార్ రచించిన ప్రశ్నాస్త్రం, బోయిన భాస్కర్ రచించిన గడ్డిపువ్వు, పొలగాని భాను తేజశ్రీ రచించిన ప్రతినిధి, పలువురి కవితల సంకలనం కవన పరిమళాలు తదితర పుస్తకాలు ఆవిష్కరిస్తారు.
(నేడు కవి సాయంత్రం 11వ వార్షికోత్సవం సందర్భంగా)
ముక్కెర సంపత్ కుమార్కవి, రచయిత 9959618206

































