ప్రతిపక్షం, ఆగస్టు 27: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటనకు సిద్ధమవుతోంది. ఆర్థిక శాఖ ఆమోదించిన సుమారు 3,800 పోస్టుల భర్తీకి దశలవారీగా కొత్త ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు సుమారు 15 నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు సమాచారం.
ఆమోదం పొందిన పోస్టుల్లో అత్యధికంగా అటవీశాఖకు సంబంధించిన బీట్ అధికారి ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 1,398 బీట్ అధికారి పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను ఈ నెలాఖరు నుంచి లేదా సెప్టెంబర్ మొదటి వారం నుంచి దశలవారీగా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. పోస్టుల సంఖ్య, విద్యార్హతలు, వయోపరిమితి, పరీక్ష విధానం, దరఖాస్తు తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత స్పష్టత రానుంది.
ఇక నియామక పరీక్షల నిర్వహణలోనూ మార్పులు తీసుకురావడానికి కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష పూర్తయిన వెంటనే అభ్యర్థులకు వారి మార్కులు తెలిసేలా వ్యవస్థను రూపొందిస్తున్నట్లు సమాచారం. దీనివల్ల పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఎక్కువకాలం వేచి చూడాల్సిన అవసరం ఉండదని అధికారులు భావిస్తున్నారు.
కొత్తగా వేలాది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రానున్నాయన్న సమాచారంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది. అధికారిక ప్రకటనలు వెలువడిన వెంటనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అభ్యర్థులు సంబంధిత వివరాలను పరిశీలిస్తూ ముందస్తు సన్నద్ధతపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.





























