ప్రతిపక్షం, ఆగస్టు 16: బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ‘విమల్ ఇలాచీ’ పేరుతో ప్రసారమవుతున్న ప్రకటనలు.. మహారాష్ట్రలో నిషేధం ఉన్న విమల్ పాన్ మసాలాకు పరోక్షంగా ప్రచారం కల్పిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
‘విమల్ ఇలాచీ’ ప్రకటనల్లో ఈ ముగ్గురు బాలీవుడ్ ప్రముఖులు నటించారు. అయితే ఇలాచీ ఉత్పత్తి పేరుతో పాన్ మసాలా బ్రాండ్‌ను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారా? అనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. ఈ ప్రకటనల్లో తమ పాత్ర ఏమిటి, ప్రకటనలో భాగస్వామ్యం ఎలా జరిగింది అనే విషయాలను వివరిస్తూ సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించినట్లు తెలుస్తోంది.
మహారాష్ట్రలో పాన్ మసాలా విక్రయాలు, వినియోగంపై నిషేధాలు అమల్లో ఉన్న నేపథ్యంలో.. నిషేధిత ఉత్పత్తులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రచారం కల్పించే ప్రకటనలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ‘సరోగేట్ అడ్వర్టైజింగ్’గా పరిగణించే ప్రకటనల విషయంలోనూ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తప్పుదారి పట్టించే ఆహార ఉత్పత్తుల ప్రకటనల్లో నటించే ప్రముఖులపైనా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిబంధనల ఉల్లంఘన రుజువైతే సంబంధిత వ్యక్తులకు రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే పలు పొగాకు, పాన్ మసాలా ఉత్పత్తుల ప్రకటనల్లో బాలీవుడ్ ప్రముఖులు నటించడంపై గతంలోనూ విమర్శలు వచ్చాయి. తాజాగా విమల్ ఇలాచీ ప్రకటనల వ్యవహారంలో ముగ్గురు స్టార్ హీరోలకు నోటీసులు రావడం బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. అధికారులు అడిగిన వివరణల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలుస్తోంది.





























