ప్రతిపక్షం, ఆగస్టు 21: మహారాష్ట్రలో మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఛత్రపతి శంభాజీనగర్‌లో 19 ఏళ్ల సూరజ్ సుభాష్ షిండే తన ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చదువు, భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
వైద్య విద్యలో ప్రవేశం పొందాలన్న లక్ష్యంతో సూరజ్ నీట్‌కు సిద్ధమవుతున్నాడు. అయితే పరీక్ష, చదువు, భవిష్యత్తుపై ఒత్తిడి పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఘటన అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
సూరజ్ రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్‌లో తల్లిదండ్రులను ఉద్దేశించి భావోద్వేగ సందేశం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ‘‘అమ్మా, నాన్నా నన్ను క్షమించండి. వచ్చే జన్మలో కచ్చితంగా డాక్టర్ అవుతాను. మీరు జాగ్రత్తగా, సంతోషంగా ఉండండి’’ అని అందులో పేర్కొన్నట్లు సమాచారం.
కలల కోసం చదువుతున్న ఓ యువకుడు ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పోటీ పరీక్షల్లో విజయం సాధించడమే జీవితానికి ఏకైక లక్ష్యం కాదని, విద్యార్థులపై కుటుంబ సభ్యులు, సమాజం అనవసరమైన ఒత్తిడి పెట్టకుండా వారికి మానసికంగా అండగా నిలవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.





























