ప్రతిపక్షం, ఆగస్టు 10: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు గంటల పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థలు హెచ్చరించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించాయి.
ఆంధ్రప్రదేశ్లో విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
తెలంగాణలో కామారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు సూచించారు.





























