[t4b-ticker]

మనుషులకు ఆధార్‌.. భూములకు భూధార్‌: మంత్రి పొంగులేటి

ప్రతిపక్షం, ఆగస్టు 10, హనుమకొండ: రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామంలో భూముల సమగ్ర సర్వే చేపట్టి, ప్రతి అంగుళం భూమికి ప్రత్యేక గుర్తింపు కల్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మనుషులకు ఆధార్‌ ఉన్నట్లే భూములకు కూడా ‘భూధార్‌’ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.

ఎల్కతుర్తిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌ పర్యటించి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. గత పాలకులు హడావుడిగా జిల్లాలు, డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసినప్పటికీ అవసరమైన కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు కల్పించలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ.600 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 180 రెవెన్యూ తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయాలను యుద్ధప్రాతిపదికన నిర్మించి, ఏడాదిలోపే పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. గతంలో అమలు చేసిన ధరణి విధానాన్ని పక్కనపెట్టి రైతులకు భద్రత, భరోసా కల్పించేలా భూభారతి ద్వారా భూ రికార్డుల ప్రక్షాళన చేపడుతున్నామని చెప్పారు.

రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామంలో భూములను సమగ్రంగా సర్వే చేసి, భూ యజమానులకు స్పష్టమైన హక్కులు కల్పిస్తామని తెలిపారు. రైతుల సహకారంతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి, భూముల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News