ప్రతిపక్షం, ఆగస్టు 03: తెలంగాణలో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఉన్న ఆయన నివాసంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో లవ్ లెటర్లు లభించినట్లు సమాచారం. దీంతో ఈ కేసులో మరో మహిళతో సంబంధం ఉన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం, లవ్ లెటర్లు ఓ వివాహిత మహిళకు సంబంధించినవిగా అనుమానిస్తున్నారు. ఆ మహిళకు 2014లో వివాహం కాగా, 2023 నుంచి భర్తకు దూరంగా ఉంటున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని సమాచారం. ఆమెతో కలిసి లివ్-ఇన్ రిలేషన్‌లో ఉండాలని ఉదయ్ కోరినట్లు, అయితే అధికారికంగా విడాకులు పూర్తి కాకపోవడంతో ఆమె అంగీకరించలేదని విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న లేఖలు, ఇతర పత్రాలు, డిజిటల్ పరికరాల సమాచారాన్ని విశ్లేషిస్తూ కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని పరిశోధిస్తున్నారు.
ఇదిలా ఉండగా, శిక్షణ సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తనపై కూడా దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ఆయనకు తీవ్ర కోపం ఉండేదని, ట్రైనింగ్ సమయంలో కొందరు సహచరులు ఆయన ప్రవర్తన వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం వెలువడుతోంది. ఈ అంశాలపై సంబంధిత వ్యక్తుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ వివరాలపై ఇప్పటివరకు పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో వెలువడుతున్న సమాచారం ప్రాథమిక విచారణ ఆధారంగానే ఉందని, పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మాత్రమే వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

















