[t4b-ticker]

భార్యతో గొడవ.. నాలుగేళ్ల కుమారుడిపై తండ్రి దారుణం.. హైదరాబాద్‌లో కలకలం

ప్రతిపక్షం, ఆగస్టు 05: హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన నాలుగేళ్ల కుమారుడిపై అమానుషంగా దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. స్థానికుల అప్రమత్తతతో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడగా, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సల్మాన్ (25) అనే వ్యక్తి భార్యతో ఏర్పడిన కుటుంబ విభేదాల కారణంగా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ క్రమంలో పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్–104 సమీపంలో తన నాలుగేళ్ల కుమారుడు అర్మాన్‌ను తీవ్రంగా కొట్టాడు. అనంతరం బాలుడి తలను పిల్లర్‌కు బలంగా కొట్టి, పైకి ఎత్తి నేలపై పడేశాడు. అంతటితో ఆగకుండా చిన్నారిని వెళ్తున్న లారీ కిందకు నెట్టేందుకు ప్రయత్నించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నిందితుడిని అడ్డుకుని బాలుడిని రక్షించారు. అనంతరం సల్మాన్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.

ఘటనపై సమాచారం అందుకున్న గుడిమల్కాపూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలే ఈ దాడికి కారణమా? లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా, స్థానికులు డయల్–100కు ఉదయం 7:29 గంటలకు సమాచారం ఇచ్చినా, పోలీసులు సుమారు 8:35 గంటలకు మాత్రమే ఘటనాస్థలికి చేరుకున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌కు సమీపంలోనే సంఘటన జరిగినప్పటికీ స్పందన ఆలస్యమైందని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసులు ఇంకా అధికారికంగా స్పందించలేదు.

Spread the love

Related News

Latest News