[t4b-ticker]

పోలీస్ నియామకాల్లో పారదర్శకతకు సీఎం రేవంత్ ఆదేశాలు.. దుష్ప్రచారం, అక్రమాలపై కఠిన నిఘా

ప్రతిపక్షం, ఆగస్టు 04: తెలంగాణ పోలీస్ శాఖలో 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదలైన పోలీస్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ నేపథ్యంలో కొన్ని రాజకీయ పార్టీలు, ఇతర స్వార్థపూరిత శక్తులు నియామక ప్రక్రియకు భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు నివేదించడంతో సీఎం అత్యవసర సమీక్ష నిర్వహించారు.

డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు ప్రభుత్వ, పోలీస్ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణా నుంచి పరీక్షల నిర్వహణ వరకు ప్రతి దశలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. నియమ నిబంధనలకు అనుగుణంగా ఎలాంటి లోపాలకు అవకాశం లేకుండా వ్యవహరించాలని ఆదేశించారు.

పరీక్ష కేంద్రాల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు కోచింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షలకు సంబంధించి సోషల్ మీడియా, ఇతర వేదికల ద్వారా తప్పుడు ప్రచారం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అభ్యర్థులను మోసం చేసే దళారులు, నకిలీ వెబ్‌సైట్లు, నకిలీ సోషల్ మీడియా ఖాతాలపై సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేక నిఘా పెట్టాలని సీఎం పేర్కొన్నారు. నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ విభాగాలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.

ఈ సమావేశంలో సీఎం ప్రధాన కార్యదర్శి వి. శేషాద్రి, హోంశాఖ ప్రధాన కార్యదర్శి శిఖా గోయల్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News