ప్రతిపక్షం, ఆగస్టు 16, హైదరాబాద్: దేశంలో ఉన్నత విద్యా సంస్థలు, ప్రపంచస్థాయి కళాశాలల కొరత కారణంగానే భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్లాల్సి వస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాను రాజకీయ నాయకుడిగా కాకుండా ఓ సాధారణ భారతీయుడిగా ఈ విషయాన్ని చెబుతున్నానని పేర్కొన్నారు.
తన కుమార్తెను చదువు కోసం అమెరికాకు పంపాల్సి వస్తోందని కేటీఆర్ తెలిపారు. ‘‘రేపు నా బిడ్డను అమెరికాలో డ్రాప్ చేయడానికి వెళ్లాలి. ఇక్కడే చదువుకోవచ్చు కదా అని అడిగితే.. అంత గొప్ప కళాశాలలు మన దగ్గర ఉన్నాయా అని ఆమె ప్రశ్నించింది. వాస్తవానికి ఆమె అడిగిన ప్రశ్నలో నిజం ఉంది’’ అని అన్నారు.
భారత్లో ప్రతిభావంతులైన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ, వారికి అవసరమైన స్థాయిలో ప్రపంచస్థాయి విద్యా సంస్థలు అందుబాటులో లేకపోవడం ఆలోచించాల్సిన అంశమని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్య కోసం వేలాది మంది విద్యార్థులు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్తున్నారని, దీనివల్ల కుటుంబాలపై భారీగా ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు.
మన దేశంలోనే అత్యుత్తమ విద్యా అవకాశాలు కల్పిస్తే విద్యార్థులు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని కేటీఆర్ అన్నారు. విద్యార్థుల ప్రతిభకు అనుగుణంగా ప్రపంచస్థాయి కళాశాలలు, పరిశోధనా సంస్థలు, ఆధునిక విద్యా సదుపాయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్లో విద్యా రంగంలో ఇంకా ఏం లోపించిందనే విషయాన్ని సమాజం, ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. మన పిల్లలు ఉన్నత చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోందో విశ్లేషించి, దేశంలోనే వారికి మెరుగైన అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యార్థులు విదేశాలకు వెళ్లడం తప్పు కాదని, అయితే దేశంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులో ఉంటే మరింత మంది విద్యార్థులు ఇక్కడే చదువుకునే అవకాశం ఉంటుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం విద్యా రంగంపై మరోసారి చర్చకు దారితీశాయి.





























