ప్రతి పక్షం చండూరు సెప్టెంబర్ 29: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చండూరు మండలంలో ఘనంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడం, అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, లబ్ధిదారులకు సులభతర సేవలు అందించడం కోసం ప్రభుత్వం ఈ నూతన స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా మంగళవారం చండూరు మండల తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మండల తహసిల్దార్ రమాకాంత్ శర్మ అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ రమాకాంత్ శర్మ మాట్లాడుతూ… పాత రేషన్ కార్డుల స్థానంలో తీసుకువచ్చిన ఈ స్మార్ట్ కార్డులు అత్యాధునిక సాంకేతికతతో రూపొందించబడ్డాయని తెలిపారు. మండల పరిధిలోని ప్రతి అర్హుడైన లబ్ధిదారుడికి పారదర్శకంగా, డిజిటల్ విధానంలో సేవలందించేందుకు ఈ నూతన స్మార్ట్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఈ కార్డుల వల్ల రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానంలో సరుకుల పంపిణీ మరింత పకడ్బందీగా జరుగుతుందని, నకిలీ కార్డుల బెడద ఉండదని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా అర్హులకే చేరుతాయని అన్నారు.
కొత్త స్మార్ట్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కార్డుల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసి మండలంలోని అర్హులందరికీ త్వరితగతిన అందజేసేందుకు రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తోందని తహసిల్దార్ తెలిపారు.అర్హులైన వారు తమ ఆధార్, పాత రేషన్ కార్డు వివరాలతో తహసిల్దార్ కార్యాలయంలో సంప్రదించి నూతన స్మార్ట్ కార్డులను పొందవచ్చని సూచించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.





























