ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

ప్రతిపక్షం, నవంబర్ 14: కేరళ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. విమానంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తి రాసి అతికించిన కాగితం కనిపించడంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది, పైలట్ వెంటనే భద్రతా చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనతో విమానాశ్రయ భద్రతా విభాగాలు అప్రమత్తమయ్యాయి.

కేరళ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో సంస్థకు చెందిన 6E-244 విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం ప్రయాణిస్తున్న సమయంలో బాత్రూంలో ఒక కాగితం కనిపించింది. ఆ కాగితంపై విమానంలో బాంబు ఉందంటూ రాసి అతికించినట్లు గుర్తించారు. బాత్రూంకు వెళ్లిన ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి వెంటనే విమాన సిబ్బందికి సమాచారం అందించారు. ప్రయాణికుల నుంచి సమాచారం అందుకున్న సిబ్బంది విషయాన్ని పైలట్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పైలట్ అప్రమత్తమై పరిస్థితిని సంబంధిత అధికారులకు తెలియజేస్తూ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు.

విమానం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం భద్రతా చర్యల్లో భాగంగా అత్యవసర ల్యాండింగ్ చేపట్టారు. విమానం దిగిన వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) అధికారులు విమానంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాంబు బెదిరింపునకు సంబంధించిన కాగితం ఎక్కడి నుంచి వచ్చింది? దానిని ఎవరు అతికించారు? విమానంలో అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పరిశీలిస్తున్నారు. విమానంలోని అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఈ ఘటనతో విమానాశ్రయంలో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. ప్రయాణికుల అప్రమత్తతతో బాంబు బెదిరింపు విషయం ముందుగానే సిబ్బందికి చేరడంతో పైలట్ తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే విమానంలో నిజంగా పేలుడు పదార్థాలు ఉన్నాయా లేదా అన్నది భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాతే స్పష్టత రానుంది. బెదిరింపు సందేశాన్ని ఎవరు రాశారు, దాని వెనుక ఉద్దేశం ఏమిటన్నది కూడా విచారణలో తేలాల్సి ఉంది. అధికారులు తనిఖీలు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Related News

Latest News