ప్రతిపక్షం, నవంబర్ 10: ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో ఉండగా ఏదైనా కేసులో అరెస్టయి 48 గంటలకు మించి జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే, వారు ఆటోమేటిక్‌గా సస్పెండ్ అయినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం లేదా సంబంధిత శాఖ ప్రత్యేకంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగి 48 గంటలకు మించి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న పరిస్థితుల్లో నిబంధనల ప్రకారమే సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని వెల్లడించింది.
బిహార్‌లోని సమస్తిపూర్ సదర్ ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ విశ్వజిత్ సింగ్‌కు సంబంధించిన బెయిల్ వ్యవహారాన్ని విచారించే క్రమంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆయనకు గతంలో పట్నా హైకోర్టు మంజూరైన బెయిల్‌ను రద్దు చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కేసును పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నిర్ణయాన్ని పునఃపరిశీలించి విశ్వజిత్ సింగ్ బెయిల్‌ను పునరుద్ధరించింది.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్‌కు సంబంధించిన నిబంధనలను ధర్మాసనం ప్రస్తావించింది. ఒక ఉద్యోగి 48 గంటలకు మించి జ్యుడీషియల్ కస్టడీలో ఉంటే, ఆ వ్యవధి పూర్తయిన తర్వాత ఆటోమేటిక్‌గా సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా మరో ఉత్తర్వు జారీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులపై క్రిమినల్ కేసులు నమోదైనప్పుడు, అరెస్టు తర్వాత కస్టడీలో గడిపిన సమయం వారి ఉద్యోగ స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.





























