ఆభరణాల కోసం ఇద్దరు వృద్ధురాళ్ల హత్యలు.. నలుగురు అరెస్ట్

  • సహజ మరణాలుగా చిత్రీకరించి పోలీసులనే తప్పుదోవ పట్టించే యత్నం
  • మరో నిందితుడు పరారీ.. రెండు హత్యల మిస్టరీని ఛేదించిన పోలీసులు

ప్రతిపక్షం, మానకొంఫుర్, నవంబర్ 7: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చనూర్ గ్రామంలో సంచలనం సృష్టించిన ఇద్దరు వృద్ధురాళ్ల హత్యల కేసును పోలీసులు ఛేదించారు. బంగారు, వెండి ఆభరణాల కోసం ఒంటరిగా నివసిస్తున్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని ఊపిరాడకుండా చేసి హత్యలకు పాల్పడిన ఐదుగురు నిందితుల్లో నలుగురిని శనివారం అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వృద్ధురాళ్లను హత్య చేసిన అనంతరం వారి ఒంటిపై ఉన్న ఆభరణాలను అపహరించి, మృతులు వృద్ధాప్యం కారణంగా సహజంగానే మరణించినట్లు నమ్మించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆదేశాల మేరకు రూరల్ ఏసీపీ పర్యవేక్షణలో తిమ్మాపూర్ సీఐ, ఎస్సైలు, పోలీసు సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతుల వివరాలను పరిశీలిస్తూ ఆధారాలు సేకరించిన పోలీసులు చివరకు రెండు హత్యల వెనుక ఉన్న నిందితులను గుర్తించారు.

మొదటి హత్యతో మొదలైన నేరాల పరంపర

వచ్చనూర్ గ్రామానికి చెందిన 103 ఏళ్ల ఒంటరి వృద్ధురాలు ఉప్పులేటి భూదమ్మను గత ఆగస్టు 16న నిందితులు లక్ష్యంగా చేసుకున్నారు. మద్దూరి సాయి తన సహచరులతో కలిసి ఆమె ఇంట్లోకి ప్రవేశించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న వెండి కడియాలు, బంగారు ముక్కుపుడకలను అపహరించారు. వృద్ధాప్యం కారణంగానే భూదమ్మ మరణించిందని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. దొంగిలించిన ఆభరణాలను పవన్ సహాయంతో మణికంఠ అనే వ్యక్తికి విక్రయించి వచ్చిన డబ్బును నిందితులు పంచుకున్నారు.

రెండో హత్యతో వెలుగులోకి వచ్చిన దారుణం

తొలి హత్య అనంతరం ఎవరికీ అనుమానం రాకపోవడంతో నిందితులు మరోసారి నేరానికి పాల్పడ్డారు. అక్టోబర్ 31న అదే గ్రామానికి చెందిన 80 ఏళ్ల ఉప్పులేటి లక్ష్మి అలియాస్ లచ్చవ్వ ఇంట్లోకి చొరబడి ఆమెను ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఆమె వద్దనున్న వెండి కడియాలు, బంగారు నల్లపూసల గొలుసు, చెవికమ్మలను అపహరించారు. వీటిలో కొన్నింటిని కరీంనగర్‌లో, మరికొన్ని బంగారు ఆభరణాలను హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

వాహనాల తనిఖీల్లో పట్టుబడిన నిందితులు

వృద్ధురాలి అనుమానాస్పద మృతిపై దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు నవంబర్ 7న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అలుగునూర్ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. తిమ్మాపూర్ వైపు నుంచి వస్తున్న స్కూటీని ఆపి తనిఖీ చేయగా ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. విచారణలో వచ్చనూర్ గ్రామంలో జరిగిన రెండు హత్యల్లో తమ ప్రమేయాన్ని వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మరో నిందితుడు ఎల్కతుర్తి రాజును హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని క్యాన్సర్ ఆసుపత్రి వద్ద అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు మానుకోల పవన్ కుమార్‌ను కూడా అరెస్టు చేశారు.

అరెస్టయిన నిందితులు వీరే..

  • మద్దూరి సాయి (24) – వచ్చనూర్ గ్రామం.
  • కిన్నెర రాజు (25) – పోరండ్ల గ్రామం.
  • ఎల్కతుర్తి రాజు (25) – కొత్తపల్లి గ్రామం.
  • మానుకోల పవన్ కుమార్ అలియాస్ జాక్ (28) – వచ్చనూర్ గ్రామం.

కనపర్తి మణికంఠ (28) – గుండ్లపల్లి గ్రామం, గన్నేరువరం మండలం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

వాహనాలు, ఆభరణాలు, సెల్‌ఫోన్లు స్వాధీనం

నిందితుల నుంచి టీవీఎస్ జూపిటర్ స్కూటీ (టీఎస్ 02 ఈహెచ్ 5726), బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ (టీఎస్ 02 ఎఫ్ఎల్ 4868), కాళ్ల వెండి కడియాలు, చేతి వెండి కడియాలు, ఐదు సెల్‌ఫోన్లతో పాటు ఒక ఇనుప గొట్టం, స్టీల్ పట్టుకారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసు బృందానికి సీపీ అభినందనలు

ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన రూరల్ ఏసీపీ, తిమ్మాపూర్ సీఐ, ఎల్‌ఎండీ కాలనీ, గన్నేరువరం, చిగురుమామిడి ఎస్సైలు, పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.

వృద్ధుల భద్రతపై పోలీసుల సూచనలు

గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధ మహిళలు ఒంటరిగా నివసించకుండా కుటుంబ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. బంగారం, వెండి ఆభరణాలను ధరించి ఒంటరిగా బయటకు వెళ్లకుండా చూడాలని, వృద్ధులు బయటకు వెళ్లినప్పుడు కుటుంబ సభ్యులు తోడుగా ఉండాలని కోరారు. చెడు వ్యసనాలకు బానిసలై అనుమానాస్పదంగా తిరిగే యువకుల సమాచారం పోలీసులకు అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిఘా ఉంచాలని, నేరాల నియంత్రణకు ప్రతి గ్రామం, వీధిలో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.

Related News

Latest News