ఆరోపణలు కాదు.. ఆధారాలతో తేల్చుకుందాం!

•నిరూపిస్తే ఆస్తి వదిలేస్తా.. లేదంటే ముక్కు నేలకు రాస్తారా?’

•రాష్ట్ర మీడియా ముందే నిజం – అబద్ధం ప్రజలే తేల్చాలి..

•మంత్రులకు నిరంజన్‌రెడ్డి ఓపెన్ ఛాలెంజ్

•సాగునీరు విడుదల చేయకుంటే నార్లాపూర్‌ ముట్టడిస్తామని హెచ్చరిక

వనపర్తి ప్రతినిధి, అక్టోబర్ 07, ప్రతిపక్షం: తాను అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలను నిరూపిస్తే తన ఆస్తిని వదిలేస్తానని, నిరూపించలేకపోతే ఆరోపణలు చేసిన వారు ముక్కు నేలకు రాసేందుకు సిద్ధమా? అని మాజి మంత్రి. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంత్రులకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తూ కలెక్టర్లు, అధికారులను ఇబ్బంది పెట్టడం మానుకోవాలని సూచించారు.బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. తాను అక్రమంగా, అన్యాయంగా ఆస్తులు సంపాదించానని నిరూపించేందుకు దర్యాప్తు అధికారులు, మీడియా సమక్షంలో విచారణకు వస్తే పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఆస్తిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. నిరూపించలేకపోతే ఆరోపణలు చేసిన మంత్రులు, వ్యక్తులు ముక్కు నేలకు రాసేందుకు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు.జూరాల, కేఎల్‌ఐ, నెట్టెంపాడు, భీమా, తాగునీటి కాలువల కింద రైతులు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగు చేస్తున్నప్పటికీ, సాగునీరు అందించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని నిరంజన్‌రెడ్డి విమర్శించారు.

శ్రీశైలం కేఎల్‌ఐ ప్రాజెక్టులో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ పంటలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.తనపై, బీఆర్‌ఎస్‌ నాయకులపై విమర్శలు చేయడం తప్ప ఎల్‌ఎన్‌ఓ కమిటీ సిఫారసులను కూడా అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం అని విమర్శించారు. నీటి లభ్యత లేకపోవడంతో కేఎల్‌ఐలోని ఐదు పంపుల్లో మూడు పంపులు పనిచేయడం లేదని ఆరోపించారు.నార్లాపూర్‌లో నీటి లభ్యత ఉన్నప్పటికీ పంటలకు నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. రైతులకు సాగునీరు అందించి ఖరీఫ్‌ పంటలను కాపాడాలని, విద్యుత్‌ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సాగునీరు విడుదల చేయకుంటే ఈ నెల 12న కేఎల్‌ఐ పరిధిలోని రైతులతో కలిసి నార్లాపూర్‌ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. పంట పొలాలను కాపాడకుండా కాంగ్రెస్‌ నాయకులు ప్రజల సమస్యలను పరిష్కరించడం మానేసి బీఆర్‌ఎస్‌ నాయకులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తన ఆస్తి కేవలం 16 ఎకరాల భూమి మాత్రమేనని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నానని తెలిపారు.

ఆరోపణలు కాదు…. ఆధారాలతో తేల్చుకుందాం!..

ఆరోపణలకు ఆధారాలతో రండి .. రాష్ట్ర మీడియా సమక్షంలో నిజానిజాలు తేల్చుకుందాం అని మంత్రి జూపల్లికి మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎండార్స్ చేసిన లేఖలు, తనపై మీరు చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలతో రావాలని, తనపై వచ్చిన ఆరోపణలు, వాటికి సంబంధించిన వాస్తవాలను రాష్ట్ర మీడియా సమక్షంలో ప్రజల ముందుంచి చర్చిద్దామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని ఆయన విమర్శించారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామని, అయితే ఆ అంశాలను పక్కనపెట్టి కేసీఆర్‌ నుంచి కింది స్థాయి నాయకుల వరకు వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. లక్ష్యం కోసం చిత్తశుద్ధితో 23 సంవత్సరాలు పనిచేశానని..ఉద్దేశపూర్వకంగా లేనిపోని విమర్శలు చేస్తూ నిర్ధారణ చేయలేని దద్దమ్మలు అని ఘాటుగా స్పందించారు. వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలకు బదులుగా ఆధారాలతో మాట్లాడే కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుడదామని పిలుపునిచ్చారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎండార్స్ చేసినట్లు పేర్కొంటున్న లేఖలను, తనపై చేసిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను బహిరంగంగా తీసుకురావాలని ఆయన కోరారు. మీడియా సమక్షంలో ఇరువైపుల వాదనలు, ఆధారాలను ప్రజల ముందుంచితే అసలు వాస్తవాలు ప్రజలకు స్పష్టమవుతాయని అన్నారు. తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేస్తూ, మంత్రి జూపల్లి కృష్ణారావు ఎప్పుడు వస్తారో కనీసం రెండు రోజుల ముందుగానే తనకు సమాచారం ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు.ఈ సవాల్‌పై జూపల్లి కృష్ణారావు ఎలా స్పందిస్తారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఇద్దరు నేతల మధ్య పలు సందర్భాల్లో రాజకీయ విభేదాలు, ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో తాజా బహిరంగ సవాల్ చర్చకు దారితీస్తోంది.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మాజీ గ్రంథాలయ చైర్మన్ లక్ష్మయ్య, మాజీ వ్యవసాయ మార్కెట్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు మాధవరెడ్డి, నందిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News