ప్రభుత్వ బడి అభివృద్ధికి గ్రామస్థుడి చేయూత..
విద్యార్థులకు గుర్తింపు కార్డుల పంపిణీ
ముగ్గురు కుమారులకు ప్రభుత్వ బడిలోనే విద్య..
రూ.5 వేల విలువైన గుర్తింపు కార్డుల వితరణ
విద్యార్థుల సంక్షేమానికి అశోక్ చేయూత
ప్రతిపక్షం, నంగునూరు నవంబరు 18: ప్రభుత్వ పాఠశాల అంటే చిన్నచూపు కాదు.. నాణ్యమైన విద్యకు నమ్మకమైన వేదిక అని చేతల్లో నిరూపిస్తూ, తన పిల్లలనే ప్రభుత్వ బడిలో చదివించడమే కాకుండా తోటి విద్యార్థుల సంక్షేమానికి సైతం అండగా నిలిచారు నర్మేట గ్రామానికి చెందిన మోతకాని అశోక్. విద్యార్థులపై ఉన్న ప్రేమాభిమానాలతో రూ.5 వేల విలువైన గుర్తింపు కార్డులను అందజేసి తన సేవా హృదయాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.నంగునూరు మండలం నర్మెట్ట ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎనగందుల మనీష్ కుమార్ మాట్లాడుతూ.. మోతకాని అశోక్‌కు ప్రభుత్వ పాఠశాలలపై అపారమైన నమ్మకం ఉందని చెప్పారు. తన ముగ్గురు కుమారులను ఇదే పాఠశాలలో చదివిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా ఇతర తల్లిదండ్రులకు కూడా ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతను వివరిస్తూ, విద్యార్థుల నమోదు పెంపునకు తనవంతు సహకారం అందిస్తున్నారని ప్రశంసించారు.
అనంతరం పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్పర్సన్ లింగంపల్లి రజిత కుమార్ దాత మోతకాని అశోక్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి స్వచ్ఛందంగా సహాయం అందించడం అభినందనీయమని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింతమందికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాలంటే ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు, గ్రామస్తులు, దాతలు కూడా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజు, బాలరాజు, మల్లేశం, గ్రామస్తులు, ఉపాధ్యాయులు తహసిన్ సుల్తానా, హర్షద్, జి. లలిత, కవిత తదితరులు పాల్గొన్నారు.





























