ప్రతిపక్షం, నవంబర్ 17: కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, వాటి అమలులో జరుగుతున్న నయవంచనకు నేటితో మూడేళ్లు పూర్తయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికల సమయంలో గొప్పగా ప్రకటించిన అభయహస్తం హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ అభయహస్తాన్ని మొండి హస్తంగా మార్చిందని ఎద్దేవా చేశారు. మూడేళ్ల క్రితం ఇదే రోజున ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ మేనిఫెస్టో తమకు భగవద్గీతతో సమానమని, అందులో పేర్కొన్న ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తామని చెప్పారని హరీశ్‌రావు గుర్తుచేశారు. అయితే మూడేళ్లు గడిచినా ఆ హామీల అమలుపై స్పష్టత లేదని, ప్రజలకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.
ప్రజల ఆశలను ఓట్లుగా మార్చుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు ఆరోపించారు. ఓట్లు వేసిన ప్రజలను మాత్రమే కాకుండా, దేవుళ్లపై ఒట్లు వేసి ఇచ్చిన హామీలను కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. గాంధీభవన్ వేదికగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని హామీల అమలుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్, మంత్రి శ్రీధర్‌బాబు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో ప్రజల్లో ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని పక్కనపెడుతున్నారని విమర్శించారు.
తెలంగాణలో ఇప్పటివరకు 38 కేబినెట్ సమావేశాలు నిర్వహించినప్పటికీ ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని హరీశ్‌రావు నిలదీశారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంతో పోల్చిన నాయకులు, అందులోని హామీల అమలుకు తీసుకున్న చర్యలను వివరించాలని అన్నారు. ఆరు గ్యారెంటీలు, వందలాది హామీలతో ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలును పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని చూస్తుంటే గాంధీ ఆత్మ కూడా క్షోభిస్తుందని వ్యాఖ్యానించారు. మూడేళ్లుగా ప్రజలను హామీల పేరుతో మభ్యపెట్టడమే కాంగ్రెస్ సాధించిందంటూ విమర్శలు గుప్పించారు.
రైతులకు రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని హరీశ్‌రావు ఆరోపించారు. 2024 మే 2న సిద్దిపేటకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అదే ఏడాది ఆగస్టు 15 నాటికి తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తానని కొమురవెల్లి మల్లన్న సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఆ గడువు దాటిపోయినా రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోనూ రైతులందరికీ రుణమాఫీ కాలేదని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా నిధుల జమ విషయంలోనూ హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ఏడాది మార్చిలో సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 45 రోజుల్లో యాసంగి రైతు భరోసా కింద 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు జమ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఆ హామీ ఇచ్చి 230 రోజులు గడిచినా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను నెరవేరిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శాలువా కప్పి స్వాగతిస్తానని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.




























