ప్రతిపక్షం, నవంబర్ 12: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఏళ్ల తరబడి తప్పుడు ప్రచారం చేశాయని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ విమర్శించారు. సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’పై వస్తున్న విమర్శల నేపథ్యంలో ప్రియాంక స్పందించారు. తన తల్లిపై గతంలో అనేక తప్పుడు కథనాలు ప్రచారం చేశారని, వాస్తవాలకు విరుద్ధమైన ఆరోపణలు చేశారని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు తన తల్లి తన జీవితంలో ఎదురైన అనుభవాలు, తనకు తెలిసిన విషయాలను పుస్తకం ద్వారా వెల్లడిస్తున్నారని తెలిపారు.
తన జీవిత కథను స్వయంగా చెప్పుకునే పూర్తి హక్కు సోనియా గాంధీకి ఉందని ప్రియాంక స్పష్టం చేశారు. ఏళ్లుగా తన తల్లిపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తూ వచ్చాయని ఆరోపించిన ఆమె.. ఇప్పుడు సోనియా తన వాదనను, తన అనుభవాలను ప్రజల ముందుంచుతున్నారని అన్నారు. ఈ పుస్తకంపై విమర్శలు చేస్తున్నవారు కూడా దాన్ని చదువుతున్నందుకు సంతోషంగా ఉందని ప్రియాంక వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ ఆత్మకథపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రియాంక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.




























