వంట గదిలో గరిటె తిప్పిన కలెక్టరమ్మ.. విద్యార్థులతో మాట మంతి

  • ఎస్సీ బాలుర వసతిగృహంలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, అక్టోబర్ 08: విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యతను తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా స్వయంగా వంటగదిలోకి వెళ్లారు. కరీంనగర్‌లోని కార్ఖానాగడ్డ ఎస్సీ బాలుర కళాశాల వసతిగృహాన్ని గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె.. హాస్టల్‌లోని సౌకర్యాలను పరిశీలించడంతో పాటు విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.వసతిగృహంలోని గదులు, పరిసరాలు, వంటగది, ఇతర సౌకర్యాలను కలెక్టర్‌ క్షుణ్ణంగా పరిశీలించారు. వంటగదిలో భోజనం తయారవుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. కూర వండుతున్న సమయంలో గరిటె పట్టుకుని కలియబెట్టడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. భోజనం నాణ్యత, వంటకు ఉపయోగిస్తున్న పదార్థాలు, పరిశుభ్రత తదితర అంశాలను వంట సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. భోజనం విషయంలో నాణ్యతతో రాజీ పడకూడదని సూచించారు. వంటగది, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు.

విద్యార్థులతో ముఖాముఖి

హాస్టల్‌లోని విద్యార్థులతో కలెక్టర్‌ నేరుగా మాట్లాడారు. భోజనం, తాగునీరు, వసతి, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

భవనానికి వెంటనే మరమ్మతులు

హాస్టల్‌ భవనం పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్‌.. అవసరమైన మరమ్మతులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు విద్యార్థులను ప్రత్యామ్నాయ వసతి గృహానికి తరలించాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వంట సిబ్బందితో కూడా కలెక్టర్‌ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌ నిర్వహణకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ తనిఖీలో సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ భాగ్యలక్ష్మి, ఏఎస్‌డబ్ల్యూఓ తిరుపతినాయక్‌, ఎస్‌డబ్ల్యూఓ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News