పెళ్లికి పిలవని అతిథులకు చెక్…?

•ఆహ్వానం లేని వ్యక్తులు ఫంక్షన్‌కు హాజరై భోజనం చేస్తే చట్టపరమైన చర్యలు

•వనపర్తిలో ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యం హెచ్చరిక బోర్డు ఏర్పాటు

వనపర్తి ప్రతినిధి,నవంబర్ 25, ప్రతిపక్షం: కార్తీకమాసం వచ్చిందంటే చాలు..పెళ్లిళ్ల సీజన్‌తో సందడి నెలకొంటుంది. అయితే పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో కొందరు ఆహ్వానం లేకుండానే ఫంక్షన్ హాళ్లకు వెళ్లి భోజనం చేసే వారితో నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పిలవని పేరంటాలకు పెళ్ళికి వచ్చే వారికీ చెక్ పెట్టేందుకు వనపర్తిలోని ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసింది. ఆహ్వానం లేని వ్యక్తులు ఫంక్షన్‌కు హాజరై భోజనం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, సెక్షన్ 441 ప్రకారం (ప్రస్తుతం బీఎన్ఎస్ సెక్షన్ 329) మూడు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించే అవకాశం ఉందంటూ బోర్డుపై పేర్కొన్నారు.పిలవని అతిథుల కారణంగా అసలైన ఆహ్వానితులకు భోజనం సరిపోక, ఫంక్షన్ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో హాల్ యాజమాన్యాలు ముందస్తు జాగ్రత్తగా ఇలాంటి హెచ్చరికలు ఏర్పాటు చేస్తున్నాయి.గతంలోనూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఉచిత భోజనం కోసం ఆహ్వానం లేకుండా వెళ్లే వారికి ఈ హెచ్చరికలు గట్టి సందేశాన్ని ఇస్తున్నాయి.

Related News

Latest News