ఫస్టియర్‌లో బోర్డు పరీక్షలు ఉంటాయా? లేదా?

ప్రతిపక్షం, నవంబర్ 24: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో విద్యావ్యవస్థలో కీలక మార్పులపై చర్చ మొదలైంది. ఇకపై ఇంటర్మీడియట్‌కు బదులుగా 11, 12వ తరగతులుగా పిలవనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో పదకొండో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల యాజమాన్యాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఫస్టియర్‌లోనూ బోర్డు పరీక్షలు నిర్వహిస్తారా? లేక పాఠశాల స్థాయిలోనే పరీక్షలు నిర్వహించి రెండో ఏడాది మాత్రమే బోర్డు పరీక్షలు ఉంటాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ అంశంపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు.

ఇంటర్మీడియట్ విలీన ప్రక్రియ పూర్తిస్థాయిలో కొలిక్కి వచ్చిన తర్వాతే పరీక్షల విధానం, పాఠ్యప్రణాళిక, విద్యార్థుల మూల్యాంకనం వంటి అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. విలీనానికి సంబంధించిన ముసాయిదా నివేదికను ప్రజల అభిప్రాయాల కోసం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచిన సమయంలో పరీక్షల నిర్వహణ అంశంపైనా అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఫస్టియర్‌కు బోర్డు పరీక్షలు అవసరం లేదనే అభిప్రాయం విద్యాశాఖలోని కొందరు అధికారుల్లో బలంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు పరీక్షలు రద్దు చేస్తే విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

11వ తరగతికి బోర్డు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని భావిస్తున్నవారు విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని ప్రధాన కారణంగా చూపిస్తున్నారు. పదో తరగతి నుంచి వరుసగా మూడు సంవత్సరాల పాటు బోర్డు పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విద్యావిధానాల్లోనూ 11వ తరగతికి ప్రత్యేక బోర్డు పరీక్షలు ఉండవని, పాఠశాల స్థాయిలోనే పరీక్షలు నిర్వహిస్తారని గుర్తు చేస్తున్నారు. అందువల్ల తెలంగాణలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని సూచిస్తున్నారు. బోర్డు పరీక్షల భారం తగ్గించి, విద్యార్థులకు సబ్జెక్టులపై లోతైన అవగాహన కల్పించడం, ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పెంపొందించడం, నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణ విద్యా కమిషన్ కూడా 11వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేయాలని గతంలో సూచించినట్లు తెలుస్తోంది. ఫస్టియర్‌లో విద్యార్థులపై మార్కులు, పరీక్షల ఒత్తిడి తగ్గించి బోధన, ప్రాక్టికల్స్, సబ్జెక్టుల అవగాహనపై దృష్టి పెట్టాలని పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వం కూడా 2025-26 విద్యా సంవత్సరం నుంచి 11వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షల మార్కులతో మాత్రమే అంచనా వేయకూడదని, నిరంతర మూల్యాంకనానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఈ విధానానికి మద్దతు ఇస్తున్నవారు చెబుతున్నారు.

అయితే ఫస్టియర్‌కు బోర్డు పరీక్షలు తప్పనిసరిగా ఉండాలనే వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కొందరు విద్యావేత్తలు సూచిస్తున్నారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విద్యార్థులతో పోలిస్తే ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఇంటి వద్ద చదువుకునే వాతావరణం, తల్లిదండ్రుల పర్యవేక్షణ తక్కువగా ఉండే అవకాశముందని చెబుతున్నారు. గురుకులాలు, రెసిడెన్షియల్ కళాశాలలను మినహాయిస్తే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సగటు హాజరు 65 శాతానికి మించడం లేదనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫస్టియర్‌లో బోర్డు పరీక్షలు లేకపోతే విద్యార్థుల హాజరు, చదువుపై ఆసక్తి మరింత తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పదకొండో తరగతిలో విద్యార్థులు సరిగా చదవకపోతే పన్నెండో తరగతి సిలబస్‌ను అర్థం చేసుకోవడం కష్టమవుతుందని పరీక్షల నిర్వహణకు మద్దతు ఇస్తున్నవారు వాదిస్తున్నారు. పదో తరగతితో పోలిస్తే ఇంటర్మీడియట్ సిలబస్ మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని, మొదటి ఏడాదిలోనే పునాది బలంగా లేకపోతే రెండో ఏడాది చదువుపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఫస్టియర్ పరీక్షలు విద్యార్థుల్లో చదువుపై క్రమశిక్షణను పెంచడంతో పాటు రెండో సంవత్సరం బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు ఉపయోగపడతాయని అభిప్రాయపడుతున్నారు.

ఇంటర్మీడియట్ ఫలితాలను పరిశీలించినా ఫస్టియర్‌లోనే విద్యార్థులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయని అధికారులు, విద్యావేత్తలు చెబుతున్నారు. మార్చి పరీక్షల్లో జనరల్ విభాగంలో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 75.61గా ఉండగా, మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం 66.94గా నమోదైంది. ఇప్పటికే ఫస్టియర్‌లో ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో బోర్డు పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తే విద్యార్థుల చదువుపై మరింత ప్రభావం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరో ముఖ్యమైన అంశం జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు. జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్, సీయూఈటీ వంటి పరీక్షలకు ఇంటర్మీడియట్ రెండేళ్ల సిలబస్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. అందువల్ల 11వ తరగతి పాఠ్యాంశాలపై విద్యార్థులకు పూర్తి అవగాహన ఉండటం అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు. ఫస్టియర్‌లో బోర్డు పరీక్షలు లేకపోతే కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు పాఠశాల స్థాయి విద్యను పక్కనపెట్టి ప్రవేశ పరీక్షల తయారీపై మాత్రమే దృష్టి పెట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మొత్తంగా ఇంటర్మీడియట్ విలీనంతో తెలంగాణ విద్యావ్యవస్థలో మార్పులు చోటుచేసుకోనున్న నేపథ్యంలో 11వ తరగతి బోర్డు పరీక్షల అంశం కీలకంగా మారింది. పరీక్షల ఒత్తిడిని తగ్గించాలా? లేక విద్యార్థుల చదువులో క్రమశిక్షణ, పునాది బలంగా ఉండేందుకు బోర్డు పరీక్షలను కొనసాగించాలా? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం రూపొందించే ముసాయిదా నివేదిక, నిపుణుల సూచనలు, ప్రజాభిప్రాయాల ఆధారంగా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటివరకు ఫస్టియర్‌లో బోర్డు పరీక్షలు ఉంటాయా? లేదా? అన్న ఉత్కంఠ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొనసాగనుంది.

Related News

Latest News