ప్రతిపక్షం, నవంబర్ 20: కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు పాలన విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సూచించారు. రాష్ట్రాన్ని దొంగలకు, పెట్టుబడిదారులకు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టవద్దని మంత్రులకు విజ్ఞప్తి చేశారు. సొంత పార్టీ ప్రభుత్వంపైనే ఆయన మరోసారి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని రాజ్‌గోపాల్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పిదాలను పునరావృతం చేయకుండా కాంగ్రెస్ మంత్రులు నిజాయితీగా పరిపాలన అందించాలని హితవు పలికారు. ముఖ్యంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించడం, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎలాంటి వివక్షకు తావులేకుండా న్యాయంగా వ్యవహరించాలని కోరారు.
ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. అహంకారపూరితంగా మాట్లాడటం మానేసి ప్రజలకు మంచి పాలన అందించడంపై మంత్రులు దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రభుత్వానికి ప్రధాన బాధ్యత కావాలని పేర్కొన్నారు.
ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేయడానికే సమయం కేటాయించడం సరికాదని రాజ్‌గోపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమిటి? ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏమిటి? అనే విషయాలను మంత్రులు ఒకసారి సమీక్షించుకోవాలని ప్రశ్నించారు. హామీల అమలుపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
తాము నిజాయితీగా, అవినీతికి తావులేకుండా పాలన అందిస్తున్నామా లేదా అనే విషయాన్ని మంత్రులు తమ అంతరాత్మను ప్రశ్నించుకోవాలని సూచించారు. గుండె మీద చేయి వేసుకుని ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ప్రజలకు మంచి పాలన అందిస్తే వారు మరోసారి ఆశీర్వదిస్తారని, అందుకు అనుగుణంగా మంత్రులు తమ పనితీరును మార్చుకోవాలని కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీశాయి.




























