ప్రతిపక్షం, vచిట్యాల, నవంబర్ 19: చిట్యాల శివారులోని భువనగిరి రోడ్డులో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.పోలీసులు మరియు స్థానికుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం భువనగిరి వైపు వెళ్తున్న ఒక ఆటోను, అదే దిశలో అతివేగంగా వెళ్తున్న లారీ వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఆటోలో ప్రయాణిస్తున్న రామన్నపేటకు చెందిన ఏనుగు శ్రీశైలం అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని మెరుగైన చికిత్స నిమిత్తం 108 వాహనంలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన గుండెబోయిన రమేష్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు రమేష్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ప్రమాద వార్త తెలియడంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీశైలం, రమేష్ మృతితో ఇటు రామన్నపేటలోనూ, అటు పెద్దకాపర్తి గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



























