ప్రతిపక్షం, నవంబర్ 18: టాలీవుడ్ నటి అనితా చౌదరికి సైబర్ మోసగాళ్లు భారీ షాక్ ఇచ్చారు. కుటుంబంతో ఆనందంగా గడపాలన్న ఆమె ఆశను ఆసరాగా చేసుకున్న కేటుగాళ్లు ఆన్లైన్ మోసానికి పాల్పడి లక్షల రూపాయలు కాజేశారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో నివసిస్తున్న తన కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విమాన టికెట్ల కోసం ఇంటర్నెట్లో వెతుకుతుండగా నకిలీ ట్రావెల్ సంస్థ వలలో చిక్కుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే.. ఈ నెల 12న అనితా చౌదరి అమెరికా వెళ్లేందుకు బిజినెస్ క్లాస్ రిటర్న్ విమాన టికెట్ల కోసం ఆన్లైన్లో అన్వేషించారు. ఈ సమయంలో ‘లో ఫ్లై ట్రావెల్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్’ పేరుతో ఉన్న ఓ వెబ్సైట్ ఆమె దృష్టికి వచ్చింది. అందులో పొందుపరిచిన ఫోన్ నంబర్‌కు ఆమె సంప్రదించగా, రాజేశ్ అనే వ్యక్తి మాట్లాడాడు. విమాన ప్రయాణానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్న అతడు టికెట్ల బుకింగ్ కోసం రూ.4,14,180 ఖర్చవుతుందని తెలిపాడు. టికెట్లు బుక్ చేయడానికి బ్యాంకు కార్డు వివరాలు అవసరమని నమ్మబలికాడు.
అతడి మాటలు నమ్మిన అనితా చౌదరి, అతడు పంపించిన ఫారంలో తన డెబిట్ కార్డుకు సంబంధించిన వివరాలను నమోదు చేశారు. అంతటితో ఆగకుండా బుకింగ్ ప్రక్రియ పూర్తిచేయాలంటూ ఆమె మొబైల్‌కు వచ్చిన వన్ టైమ్ పాస్‌వర్డ్‌లను (ఓటీపీ) కూడా అడిగాడు. టికెట్ల రిజర్వేషన్ కోసమే ఈ వివరాలు అవసరమని భావించిన ఆమె వాటిని అతడికి వెల్లడించారు. దీంతో సైబర్ నేరగాళ్లు తమ పథకాన్ని అమలు చేసి ఆమె బ్యాంకు ఖాతా నుంచి భారీ మొత్తాన్ని కాజేశారు.
అయితే ఎంతసేపటికీ విమాన టికెట్లకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు రాకపోవడంతో అనితా చౌదరికి అనుమానం వచ్చింది. అదే సమయంలో క్లియర్‌ట్రిప్ ద్వారా రూ.4,14,180 తన ఖాతా నుంచి డెబిట్ అయినట్లు సందేశం రావడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. టికెట్ల బుకింగ్ జరగకపోగా, ఖాతాలోని నగదు మాయమైందని గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు. ఆలస్యం చేయకుండా బ్యాంకు కస్టమర్ కేర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశారు. అనంతరం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు.
నటి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజేశ్ పేరుతో మాట్లాడిన వ్యక్తి ఎవరు? నకిలీ ట్రావెల్ సంస్థ వెనుక ఎవరున్నారు? కాజేసిన నగదు ఏయే బ్యాంకు ఖాతాలకు బదిలీ అయింది? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. ఆన్లైన్లో విమాన టికెట్లు బుక్ చేసుకునే సమయంలో గుర్తింపు పొందిన అధికారిక వెబ్సైట్లు, విశ్వసనీయ ప్రయాణ సంస్థలను మాత్రమే ఆశ్రయించాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అపరిచితులు పంపించే లింకులు, ఫారాల్లో బ్యాంకు వివరాలు నమోదు చేయకూడదని, ఫోన్ ద్వారా ఎవరైనా అడిగినా ఓటీపీలు వెల్లడించకూడదని హెచ్చరిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం కూడా భారీ ఆర్థిక నష్టానికి దారితీస్తుందని ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.





























