ప్రతిపక్షం, నవంబర్ 18: తెలంగాణలోని వరంగల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు తట్టుకోలేక ఓ వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతేకాకుండా తమతో పాటు పెంపుడు కుక్కకు కూడా విషమిచ్చి ప్రాణాలు తీసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. సంజయ్ (60), శోభ (55) అనే దంపతులు ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారి మరణవార్తతో కుటుంబ సభ్యులు, స్థానికులు విషాదంలో మునిగిపోయారు.
సంజయ్, శోభ దంపతుల కుమారులు ఉపాధి కోసం ముంబైలో ఉంటున్నారని, తల్లిదండ్రులు వరంగల్లో నివసిస్తున్నారని తెలిసింది. అనారోగ్య సమస్యల కారణంగా సంజయ్ పని చేయలేకపోయారని, దీంతో కుటుంబ అవసరాల కోసం రూ.50 వేల అప్పు చేసినట్లు సమాచారం. అయితే తీసుకున్న అప్పుపై చక్రవడ్డీ పెరుగుతూ పోవడంతో ఎంత మొత్తం చెల్లించినా అప్పు తీరడం లేదని దంపతులు తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. అప్పు ఇచ్చినవారి నుంచి ఎదురైన వేధింపులు, అవమానాలు వారి మనోవేదనను మరింత పెంచినట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు.
తమకు తినడానికి కూడా దిక్కులేని పరిస్థితి ఉందని, అలాంటి సమయంలో పెంపుడు కుక్కను ఎందుకు పెంచుకుంటున్నారని కొందరు అవమానించినట్లు దంపతులు లేఖలో రాసినట్లు సమాచారం. ఆ మాటలు తమను ఎంతగానో బాధించాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తమ జీవితంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి, ఇతరుల మాటలతో కలిగిన మనస్తాపాన్ని సూసైడ్ నోట్లో వివరించారు.
‘దేవుడా.. మళ్లీ జన్మంటూ ఉంటే బిచ్చగాళ్లలా పుట్టించు కానీ ఈ మధ్యతరగతి బతుకు వద్దు’ అంటూ వారు రాసిన చివరి మాటలు హృదయాలను కలచివేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ, అప్పుల భారం నుంచి బయటపడలేక దంపతులు ఇంతటి విషాద నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. పెంపుడు కుక్కకు కూడా విషమిచ్చి ఆత్మహత్య చేసుకోవడం ఈ ఘటనలో మరింత విషాదాన్ని నింపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అప్పుల బాధలు లేదా ఆత్మహత్య ఆలోచనలతో ఎవరైనా ఇబ్బందిపడుతుంటే ఒంటరిగా ఉండకుండా వెంటనే కుటుంబ సభ్యులు, నమ్మకమైన వ్యక్తులు లేదా స్థానిక అత్యవసర సహాయ సేవలను సంప్రదించడం ముఖ్యం.




























