ప్రతిపక్షం, అక్టోబర్ 31: ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు, వారి సమస్యలపై పోరాటం చేసేందుకు కొత్త రాజకీయ శక్తిగా తమ పార్టీ ప్రజల ముందుకు వచ్చిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రకృతి సంపద, అడవులు, నదులు, వ్యవసాయానికి అనుకూలమైన వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో వెనుకబడిపోవడానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. జిల్లాలో ఇప్పటికీ వందలాది గ్రామాలకు కనీస పాఠశాలలు లేకపోవడం ఆందోళనకరమని, రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ.11 లక్షలు ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ.2 లక్షలు కూడా లేదని పేర్కొన్నారు. ఒకప్పుడు రాష్ట్రానికి అధిక ఆదాయం అందించిన ఆదిలాబాద్ ప్రస్తుతం 27వ స్థానానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంద్రవెల్లి పుణ్యభూమికి పాదాభివందనం చేస్తున్నానని పేర్కొన్న కవిత, స్వాతంత్ర్యం కోసం, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన రామ్‌జీ గోండు, వన్నెల ఎల్లన్న, వెడమ రాము, కొమురం భీమ్, శిడెం శింబు, కొమురం సూరు వంటి మహనీయులను స్మరించుకున్నారు. జల్, జమీన్, జంగల్ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం కొమురం భీమ్ చేసిన పోరాటాన్ని గుర్తుచేశారు. ఇంద్రవెల్లి ఘటనలో ఆదివాసీలపై కాల్పులు జరిపిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. ఆ ఘటనకు సంబంధించిన బాధను, త్యాగాలను గుర్తుచేసుకుంటూ నిర్మించిన అమరవీరుల స్థూపం ఇక్కడే ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం రూ.5 లక్షలు మాత్రమే ఇచ్చి మిగిలిన హామీని విస్మరించారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు నెలలకు ఒకసారి ఆదిలాబాద్ జిల్లాకు వస్తానన్న ముఖ్యమంత్రి మూడేళ్లలో రెండుసార్లు మాత్రమే వచ్చారని, జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు.
ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిపై కవిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగజ్‌నగర్ ప్రాంతంలో లక్షా ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా కేవలం ఆరు వేల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోందని అన్నారు. కేపీ రావు, జగన్నాథ ప్రాజెక్టులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పేరుతో గత పన్నెండేళ్లుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు హామీలు ఇస్తున్నాయే తప్ప పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఉంటే సుమారు రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని పేర్కొన్నారు. ఇప్పుడు కరువు పరిస్థితులు ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి మహారాష్ట్రకు వెళ్లి ప్రాజెక్టుల గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ముందుగా 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, ఒప్పందం ప్రకారం 148 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసే అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతులను పంటలు వేయవద్దని సూచించిన తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కవిత విమర్శించారు. వ్యవసాయం తప్ప మరో పని తెలియని రైతులకు పంటలు వేయవద్దని చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. కరువు వస్తుందని ముందుగానే తెలిసినా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రైతులకు సాగునీరు, విద్యుత్, యూరియా అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పంటలు వేయవద్దని చెప్పే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగడానికి నైతికంగా ఎలా అర్హులవుతారని ప్రశ్నించారు. రైతులకు గౌరవం కల్పించేలా, వారి సమస్యలకు పరిష్కారం చూపేలా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ నిర్వహించనున్న రైతు గర్జన సభపైనా కవిత ప్రశ్నలు సంధించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించలేని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు రైతు గర్జన పేరుతో ఏ ముఖం పెట్టుకుని సభ నిర్వహిస్తారని నిలదీశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్ ప్రాంతానికి ఒక్క విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్ కళాశాల కూడా తీసుకురాలేదని ఆరోపించారు. అధికారంలోకి వస్తే ఆదిలాబాద్‌కు యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లు విషయంలో ప్రైవేట్ వ్యక్తులకు వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చారని, కానీ అక్కడ పనిచేసే కార్మికులకు మాత్రం తగిన న్యాయం చేయలేదని విమర్శించారు. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిజామాబాద్ చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించడంలో బీఆర్ఎస్ విఫలమైందని అన్నారు. ఈ పరిశ్రమలను తెరిపించకపోవడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల పాత్రపై ప్రజలు ప్రశ్నించాలని సూచించారు.
చనాఖా-కొరటా ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై కూడా కవిత పలు ఆరోపణలు చేశారు. మొదట రూ.368 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు అంచనా వ్యయం ఏకంగా రూ.2,100 కోట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. నిర్మాణ సామగ్రి ధరలు పెరిగినంత మాత్రాన ప్రాజెక్టు వ్యయం ఇంత భారీగా పెరగడం ఎలా సాధ్యమని నిలదీశారు. ఈ పెరిగిన వ్యయంలో అవినీతి జరిగిందా? ఆ సొమ్ము ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. మాజీ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్నకు సంబంధం ఉందా? లేక బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి వెళ్లిందా? అనే అంశాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ తన ఆరోపణలేనని, సంబంధిత నాయకులు ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు. గోదావరి, ప్రాణహిత నదులు జిల్లాలో ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందకపోవడం పాలకుల వైఫల్యమని విమర్శించారు.
ఆదిలాబాద్‌లో పత్తి సాగు విస్తారంగా జరుగుతోందని, సుమారు 80 లక్షల క్వింటాళ్ల పత్తి ఉత్పత్తి అవుతున్నప్పటికీ టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని కవిత ఆరోపించారు. పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఈ ప్రాంతంలో పత్తి ఆధారిత పరిశ్రమలను ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉంటే యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేవని, రైతులకు కూడా పత్తికి మెరుగైన ధర లభించే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు. గోదావరి పుష్కరాల కోసం రూ.200 కోట్లు కేటాయించామని చెబుతున్నప్పటికీ పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రక్షణ సేన తరఫున పాంచజన్య పేరుతో ఐదు ప్రధాన అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని కవిత ప్రకటించారు. ప్రైవేట్ రంగంలోనూ మెరుగైన ఉచిత విద్య, వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒక కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వస్తే నాలుగు నెలల జీతం ఆసుపత్రి ఖర్చులకే సరిపోతున్న పరిస్థితి ఉందని, పేద, మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలని అన్నారు. యువత తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యాపారాలు ప్రారంభించుకునేందుకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణ సదుపాయం కల్పించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా ఎదిగేలా చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
ఆదివాసీల సమస్యలపై ప్రత్యేకంగా ప్రస్తావించిన కవిత, ఐటీడీఏ పరిధిలో గతంలో అమలులో ఉన్న జీవో 57తో పాటు మొత్తం 27 జీవోలను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. 1972లో భూములు, ఆస్తులు కొనుగోలు చేసుకున్న ఆదివాసీలకు న్యాయం జరగాలని అన్నారు. ఆదివాసీ మహిళల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉందని, వారికి ఐటీడీఏ ద్వారా అందించాల్సిన పోషకాహారం సక్రమంగా అందడం లేదని ఆరోపించారు. రిమ్స్ ఆసుపత్రి పరిధిలోని ఆరోగ్య కేంద్రాల పరిస్థితి కూడా అధ్వానంగా ఉందని పేర్కొన్నారు. రిమ్స్‌లో చిన్నారులు మృతి చెందిన ఘటనలపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం లేదని, ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కూడా సమయం కేటాయించడం లేదని విమర్శించారు. ఆదివాసీల విద్య, వైద్యం, ఉపాధి, భూమి హక్కుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు ఉన్నాయని ఆరోపిస్తూ సిద్దిపేట, సిరిసిల్ల నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కవిత వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ మతాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. తెలంగాణలో హిందూ, ముస్లింలు పరస్పర గౌరవంతో, ప్రశాంతంగా జీవించాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. మతపరమైన వివాదాల ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందే ప్రయత్నాలను ప్రజలు గమనించాలని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పాలనల్లో ఆదిలాబాద్ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావిస్తూ, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండే రాజకీయ శక్తిగా తమ పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు.
సామాజిక న్యాయం మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నామని కవిత స్పష్టం చేశారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు తమ పార్టీ తరఫున బీసీ అభ్యర్థులైన డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్, ఆకాశ్‌లకు అవకాశం కల్పించామని తెలిపారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం, ఆర్థిక బలం లేని సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన విద్యావంతులైన యువకులకు రాజకీయాల్లో అవకాశం కల్పించడమే తమ ఉద్దేశమని చెప్పారు. తెలంగాణ కోసం పనిచేసిన యువతకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తే వ్యవస్థలో మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో కొత్త తరానికి అవకాశాలు కల్పించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడవచ్చని పేర్కొన్నారు.
చివరగా ఆదివాసీలు, రైతులు, యువత, మహిళలు సహా ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆశీర్వాదం కోసమే తాను ఇక్కడికి వచ్చానని కవిత తెలిపారు. నాగోబా తల్లి ఆశీస్సులతో తమ పార్టీ తొలి జెండా ఆదిలాబాద్ నుంచే ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ రక్షణ సేన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఆదిలాబాద్ అభివృద్ధి, సాగునీటి సమస్యలు, ఆదివాసీల హక్కులు, యువతకు ఉపాధి, నాణ్యమైన విద్య, వైద్యం వంటి అంశాలపై ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేస్తామని ప్రకటించారు.








































