దొరికిన బ్యాగులో ఐఫోన్, రూ.10 వేల నగదు, బంగారు ఉంగరాలు.. యజమానికి అప్పగింత
ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ అక్టోబర్ 24: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల ఆలయ ప్రాంగణంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది శ్రీకాంత్, భూపాల్ నిజాయితీని చాటుకున్నారు. శనివారం ఆలయ గోపురం వద్ద వారికి ఒక నల్లటి బ్యాగు దొరికింది. అందులో ఐఫోన్, రూ.10 వేల నగదు, రెండు బంగారు ఉంగరాలు ఉన్నట్లు గుర్తించారు.వెంటనే బ్యాగును ఏడుపాయల ఆలయ ఈఓ కార్యాలయానికి తీసుకెళ్లి యజమాని కోసం వేచి ఉన్నారు. ఇంతలో కూకట్పల్లికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి తన బ్యాగు పోయిందని అక్కడికి వచ్చాడు. బ్యాగులోని వస్తువుల వివరాలను నిర్ధారించుకున్న అనంతరం, ఆలయ ఈఓ సమక్షంలో దానిని యజమానికి అప్పగించారు.
పోలీసు సిబ్బంది నిజాయితీ, బాధ్యతాయుతమైన విధి నిర్వహణను మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, అభినందించారు. ఇలాంటి నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని మరింత పెంపొందించాలని సూచించారు.




























