శామీర్ పేట పెద్దమ్మ కాలనీలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు!

ప్రభుత్వ సూచిక బోర్డు ఉన్నా ఆగని పనులు.. పట్టించుకోని రెవెన్యూ అధికారులు!

ప్రతిపక్షం,శామీర్‌పేట,అక్టోబర్13: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట రెవెన్యూ పరిధిలోని పెద్దమ్మ కాలనీలో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. కాలనీలోని సర్వే నంబర్ 1266లో ప్రభుత్వ భూమిగా సూచించే బోర్డు ఏర్పాటు చేసి ఉన్నప్పటికీ, అక్కడ నిర్మాణాలు కొనసాగుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత రెవెన్యూ అధికారులదే అయినప్పటికీ, నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా పెద్దమ్మ కాలనీలోని ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు సాగుతున్నప్పటికీ, వాటిని అడ్డుకునే చర్యలు కనిపించడం లేదని విమర్శిస్తున్నారు.

ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన కింది స్థాయి అధికారులు, నిర్మాణదారుల నుంచి ముడుపులు తీసుకుంటూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజా ఆస్తులకు రక్షణ ఎలా ఉంటుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పెద్దమ్మ కాలనీలోని ప్రధాన రహదారి సమీపంలో ప్రభుత్వ సూచిక బోర్డు ఉన్నప్పటికీ నిర్మాణాలు కొనసాగుతుండటంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.

ఇప్పటికైన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సర్వే నంబర్ 1266లోని భూముల హద్దులను నిర్ధారించి, అక్రమ నిర్మాణాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Spread the love

Related News

Latest News