మోపాల్‌లో ఆధునిక పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం అభినందనీయం: రాష్ట్ర డి.జి.పి వెల్లడి

ప్రతిపక్షం బ్యూరో, నవంబర్ 28: నిజామాబాద్ జిల్లా లోని మోపాల్ మండలంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని రాష్ట్ర డీజీపీ సీ.వీ ఆనంద్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి లతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు.

డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ మోపాల్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి సహకరించిన ప్రజాప్రతినిధులు, సర్పంచులు, గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు నిత్యావసర సేవలు అందించే ముఖ్యమైన కార్యాలయాల్లో తహశీల్దార్ కార్యాలయంతో పాటు పోలీస్ స్టేషన్ కూడా ఒకటని పేర్కొన్నారు. అలాంటి కీలకమైన పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ప్రజలు స్వచ్ఛందంగా సహకరించడం అభినందనీయమన్నారు.

నిజామాబాద్ జిల్లా తనకు కొత్తేమీ కాదని , గతంలో ఇక్కడ పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం జిల్లాకు వచ్చినప్పుడు ప్రజలు చూపిన ఆత్మీయ స్వాగతం పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చిందన్నారు. తన కుమారుడు సైతం నిజామాబాద్ జిల్లాలో తాను పనిచేస్తున్న సమయంలోనే జన్మించాడని, ఆ అనుబంధంతోనే తన కుమారుడికి నిఖిల్ అని పేరు పెట్టినట్లు తెలిపారు.

నిజామాబాద్ రూరల్ పోలీస్ సబ్ డివిజన్ పరిధి విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున పరిపాలన, పోలీసింగ్ సౌలభ్యం కోసం ప్రత్యేకంగా ఎనిమిది పోలీస్ స్టేషన్లతో రూరల్ డివిజన్‌ను మంజూరు చేసినట్లు తెలిపారు. అందులో భాగంగానే మోపాల్ నూతన పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. జిల్లా ప్రజలు శాంతియుత స్వభావం కలిగిన వారని, ఎన్నికలు సైతం ప్రశాంతంగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు.

ఈ కార్యక్రమంలో మల్టీ జోన్ 1 ఐ జీ పీ కార్తికేయ, డీ ఐ జీ నారాయణ్ నాయక్, సిపి సాయి చైతన్య, ఎసిపి ప్రకాష్, స్తానిక ఎస్ హెచ్ వో సుష్మిత, రాష్ట్ర గీతా పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, మోపాల్ మండల ప్రజాప్రతినిధులు, గ్రామాల సర్పంచులు, నాయకులు, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News