వైభవంగా శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం,కనులపండువగా రథోత్సవం

సంగీత విభావరితో అలరించిన ప్రముఖ గాయకుడు

దీక్షితులు సుబ్రహ్మణ్యం

ప్రతిపక్షం ప్రతినిధి, ఖానాపూర్ నవంబర్ 25: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పద్మావతీనగర్‌లో కొలువుదీరిన శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో 42వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి నిర్వహించిన జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తజనసంద్రంగా మారాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులుతీరగా,ఆలయ ప్రాంగణమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది.బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని, రాజగోపురాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. హవన బలిహరణాదులు, రథయాగం,రథబలి, ఆకాశదీపం తదితర వైదిక కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

కనులపండువగా రథోత్సవం

స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పురవీధుల గుండా రథోత్సవాన్ని నిర్వహించారు. మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య రథోత్సవం వైభవంగా సాగింది.పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ఈ వేడుకను తిలకించేందుకు స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

సంగీత విభావరికి విశేష స్పందన

మరోవైపు ఆలయ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.ప్రముఖ గాయకుడు దీక్షితులు సుబ్రహ్మణ్యం నిర్వహించిన సంగీత కచేరీ ఆహూతులను అలరించింది. భక్తి గీతాలు, ఆధ్యాత్మిక గానాలతో కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.యజ్ఞాచార్యులు వాసుదేవాచార్యులు, నరసింహమూర్తి, అర్చకులు సందీప్‌శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఆలయ కమిటీ అధ్యక్షుడు అడ్డగట్ల రాజన్న,ప్రధాన కార్యదర్శి పోలంపెల్లి రమేష్, కోశాధికారి ఉష్కోల సుధాకర్ తదితరులు ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Related News

Latest News