*రోడ్డు నిర్మాణం పనుల్లో నాణ్యత లోపం.
*నల్గొండ జిల్లా ఎమ్మార్పీఎస్ (MRPS) వర్కింగ్ ప్రెసిడెంట్ నారపాక అంజి మాదిగ.
ప్రతి పక్షం చండూరు, నవంబర్ 11: చండూరు మండలంలోని నేర్మట నుండి ధోనిపాముల ప్రధాన రహదారి వెడల్పు మరియు మరమ్మత్తు పనులు నాణ్యత లేకుండా జరుగుతున్నాయని ఎమ్మార్పీఎస్ నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారపాక అంజి మాదిగ ఆరోపించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కాంట్రాక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రహదారి నిర్మాణంలో భాగంగా నిర్మించిన సిమెంట్ మోరీలు (గూన కాల్వర్టు) వేసి పది రోజులు గడుస్తున్నా, వాటికి కనీసం నీళ్లు పోయడం (క్యూరింగ్ చేయడం) లేదని ఆయన తెలిపారు. క్యూరింగ్ కోసం కాల్వర్టులపై వరిగడ్డి గానీ, గోనె సంచులు గానీ కప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా, నాణ్యత ప్రమాణాలు పాటించకుండానే ఆ కాల్వర్టులను మట్టితో పూడ్చి పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు.ప్రజాధనాన్ని వృథా చేస్తూ నాణ్యత లేని పనులు చేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్ పై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని నారపాక అంజి మాదిగ డిమాండ్ చేశారు.
































