“వెంకన్నా.. మల్లన్నా.. ఎలా ఉన్నారు?”

కేసీఆర్ ఆత్మీయ పలకరింపు!

వ్యవసాయం నుంచి రాజకీయాల దాకా ఆరా

నంగునూరు నేతలతో గులాబీ బాస్ ఆసక్తికర ముచ్చట్లు!

రాజకీయాల మాట పక్కనపెట్టి.. ముందుగా ఆప్యాయ పలకరింపు!

ప్రతిపక్షం, నంగునూరు, నవంబరు 3: “వెంకన్నా.. మల్లన్నా బాగున్నారా? వ్యవసాయ పనులు ఎలా సాగుతున్నాయి?” అంటూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నంగునూరు మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులను ఆప్యాయంగా పలకరించారు. దీంతో కేసీఆర్ తో వీరి సమావేశం ఆత్మీయ వాతావరణంలో జరిగింది. ఆత్మీయ పలకరింపుతో మొదలైన మాటలు.. వ్యవసాయ పరిస్థితుల నుంచి రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ పనితీరు, ప్రజల స్పందన వరకు కొనసాగాయి. పాత పరిచయాలను గుర్తు చేసుకుని కేసీఆర్ సాగించిన ఈ ముచ్చట్లు ఆసక్తిని రేకెత్తించాయి. సిద్ధిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వేముల వెంకటరెడ్డి, నంగునూరు మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ సభ్యుడు దువ్వల మల్లయ్య యాదవ్ మంగళవారం ఎర్రవల్లిలో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా వ్యవసాయ పనుల గురించి ఆరా తీశారు.

రైతుల పరిస్థితి ఎలా ఉంది?

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగు పనుల పురోగతి తదితర అంశాలపై కేసీఆర్ ఆసక్తిగా వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు, ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై ప్రజల స్పందన ఎలా ఉందనే విషయాలపై ఆరా తీశారు.

క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చ

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలపై గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు, పార్టీ శ్రేణుల పరిస్థితి తదితర అంశాలపై కూడా చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా వేముల వెంకటరెడ్డి, దువ్వల మల్లయ్య యాదవ్ తమ ప్రాంతాల్లోని పరిస్థితులు, ప్రజల సమస్యలు, రాజకీయ పరిణామాలకు సంబంధించిన వివరాలను కేసీఆర్‌కు వివరించారు. రాజకీయ చర్చల మధ్య ఆత్మీయతకు పెద్దపీట వేస్తూ పాత పరిచయాలను గుర్తుచేసుకున్న కేసీఆర్ పలకరింపు ఈ భేటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నంగునూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులతో జరిగిన ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Related News

Latest News