కూరెళ్లి శ్రీనివాసరెడ్డికి గురువందనం అవార్డు
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట/కుకునూరుపల్లి, అక్టోబరు 13: సిద్ధిపేట జిల్లా కుకునూరు పల్లి మండలం కుకునూరుపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కూరెళ్లి శ్రీనివాసరెడ్డికి మరో గౌరవం దక్కింది. జీ తెలుగు న్యూస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన గురువందనం కాంక్లేవ్‌లో ఆయన గురువందనం అవార్డును అందుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్ కె.కేశవరావు, శాసనమండలి సభ్యుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి హాజరయ్యారు. జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భరత్‌కుమార్, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్‌రెడ్డి, అధికార ప్రతినిధి వంగ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి అవార్డు తర్వాత మరో గుర్తింపు
కూరెళ్లి శ్రీనివాసరెడ్డి గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. తాజాగా గురువందనం అవార్డుకు ఎంపిక కావడంతో ఆయనకు మరో గుర్తింపు లభించినట్లయింది. ఒకే ఉపాధ్యాయుడికి రాష్ట్ర స్థాయి పురస్కారంతో పాటు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కడం విశేషం.
పలువురి అభినందనలు
శ్రీనివాసరెడ్డికి గురువందనం అవార్డు లభించడంతో పీఆర్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆదరాసుపల్లి శశిధరశర్మ, కుకునూరుపల్లి మండల విద్యాధికారి బచ్చలి సత్తయ్య, కొండపాక మండల విద్యాధికారి పురుమాండ్ల శ్రీనివాసరెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు. ఆయన సాధించిన గుర్తింపు ఉపాధ్యాయ వర్గాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.






























